● హంపాపురంలో నేలవాలిన ద్రాక్ష పంట.. రూ.40 లక్షల నష్టం
హంపాపురంలో నేలవాలిన ద్రాక్షతోట, కణేకల్లు–మాల్యం మధ్య వేదవతి హగిరిపై రోడ్డు తెగిన దృశ్యం
అనంతపురం అగ్రికల్చర్: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 23 మండలాల పరిధిలో 7.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్, డీ హీరేహాళ్ మండలాల్లో 40 మి.మీ మేర భారీ వర్షం కురిసింది. ఇక అనంతపురం రూరల్ 28.4 మి.మీ, కూడేరు 25.6, యల్లనూరు 25.2, గార్లదిన్నె 20.8 మి.మీతో పాటు శింగనమల, ఆత్మకూరు, పెద్దపప్పూరు, రాప్తాడు, శెట్టూరు, కుందుర్పి, తాడిపత్రి, వజ్రకరూరు, బెళుగుప్ప, యాడికి, కంబదూరు, విడపనకల్లు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది.
ద్రాక్ష రైతుకు రూ.40 లక్షల పంటనష్టం
కాగా గాలులతో కూడిన వర్షం పడటంతో అక్కడక్కడా వేరుశనగ, పత్తి, ద్రాక్ష, టమాట తదితర పంటలు దెబ్బతిన్నాయి. రాప్తాడు మండలం హంపాపురంలో రైతు గద్దె కేశవరెడ్డికి చెందిన ఐదు ఎకరాల ద్రాక్ష తోట నేలవాలింది. రూ.40 లక్షలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు.
రాకపోకలు బంద్
కణేకల్లు: మండలంలోని రచ్చుమర్రి, ఆదిగానిపల్లి, వేపరాలతోపాటు వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. కణేకల్లు శివారులోని వేదవతి హగరిపై వేసిన తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. ఉరవకొండ నుంచి రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ బస్సులు మాల్యం దాకా వచ్చి అటు నుంచి అటే వెళుతున్నాయి. దీంతో రాయదుర్గం, కణేకల్లు నుంచి ఉరవకొండకెళ్లే ప్రయాణికులు.. ఉరవకొండ నుంచి ఇటు వైపు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్చెల్సీ అక్విడెక్ట్‌పై ప్రత్యామ్నాయ మార్గమున్నప్పటికీ ఆ అక్విడెక్ట్ శిథిల దశకు చేరుకున్నందున అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. మరోవైపు రూ.6కోట్ల వ్యయంతో వేదవతి హగరిపై కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వాహనాల రాకపోకలకు ఇబ్బందులుండవు.


