● రూ.8 కోట్లకు పైగా మొక్కజొన్న, శనగ కొనుగోలు
● 2 నెలల్లో ఇస్తానని.. మాట తప్పిన వైనం
అనంతపురం అర్బన్: దళారి చేతిలో రైతులు దగాపడ్డారు. మొక్కజొన్న, శనగ కొనుగోలు చేసి డబ్బుల ఇవ్వకుండా ఐపీ నోటీసులు పంపి మోసం చేశాడు. తమకు న్యాయం చేయాలని యల్లనూరు, పుట్లూరు మండలాలకు చెందిన బాధిత రైతులు సోమవారం కలెక్టరేట్‌లో ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు ఫిర్యాదు అందజేశారు. అనంతరం రైతులు సుధాకర్ నాయకుడు, రాజేశ్వరనాయుడు, శివనారాయణ, మాధవరెడ్డి, నాయుడప్ప, జానకీనాయుడు, తదితరులు మీడియాతో మాట్లాడారు. పంట కొనుగులు చేసి డబ్బులు చెల్లించకుండా తమను దళారి మోసం చేశాడన్నారు. రెండు మండలాల్లోనూ 93 మంది రైతుల నుంచి రూ.8 కోట్లకు పైగా విలువ చేసే మొక్కజొన్న, శనగ పంటను పుట్లూరు మండలం సంజీవపురానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డి అనే వ్యక్తి ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్యకాలంలో కొనుగోలు చేశాడని చెప్పారు. రెండు నెలల్లో చెల్లిస్తానని చెప్పి.. ఐదు నెలలు అవుతున్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే పోలీసు స్టేషన్లలో 10 రోజుల క్రితం ఫిర్యాదు చేశామన్నారు. అయితే అతను వారం క్రితం తమకు ఐపీ నోటీసు పంపించాడని తెలిపారు. అది కూడా పంట కొనుగోలుకు కాకుండా తాను ఎరువుల దుకాణం పెట్టుకునేందుకు రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా ఐపీ నోటీసులో పేర్కొన్నాడని వాపోయారు.
● కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 591 అర్జీలను అధికారులు స్వీకరించారు.


