● ప్రజాప్రతినిధులపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం
● కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్
అనంతపురం: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టకుండా ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత సంపాదనపైనే దృష్టి కేంద్రీకరించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని క్లాక్‌టవర్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి నరేష్ అధ్యక్షతన కరువు దీక్షలు చేపట్టారు. ముఖ్య అతిథులుగా అనంత తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గడచిన ఐదు దశాబ్ద కాలంలో జిల్లా ప్రజలు ఎన్నడూ ఇటువంటి కరువు పరిస్థితులను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 2.90 లక్షల ఎకరాల ఉద్యాన పంటల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. దాదాపు లక్ష ఎకరాల్లోని చీనీ తోటలు నీళ్లు లేక ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచక పంటను తొలగిస్తున్నారని ఆవేదన చెందారు. రెండు నెలలుగా కరువు హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తుంగభద్ర నీటిని తాగునీటికే పరిమితం చేశారని, ఆందోళనలు చేస్తేనే రాయదుర్గం, ఉరవకొండ ప్రాంతాలకు అరకొరగా సాగునీరందిస్తున్నారని చెప్పారు. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా వస్తున్న నీటిని సౌత్ కెనాల్, నార్త్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్‌కు విడుదల చేయాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ప్రయోజనాలను ఫణంగా పెట్టి కృష్ణా డెల్టాకు నీటిని తరలించడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు సహాయక చర్యలు, రైతులకు పరిహారం, తాగునీరు, పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే వైఎస్సార్‌సీపీ తరఫున జిల్లావ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, రైతు కూలీ సంఘం నాయకుడు నాగరాజు, ఐఎఫ్‌టీయూ నాయకుడు ఏసురత్నం, పట్టణ పేదల సంఘం నాయకుడు వీరనారప్ప, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మాజీ మేయర్ వసీం, నాయకులు ఎద్దుల అమర్నాథ్ రెడ్డి, హనుమంతు, అనంతపురం రూరల్ మండల నాయకులు ఓబులేసు, వెంకట్రాముడు, రెడ్డప్ప, నరసింహులు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


