● ఇన్‌చార్జ్ సీఈఓ, చైర్మన్ మౌనం
● నోటీసులు జారీ చేసిన విచారణ అధికారి
నార్పల : స్థానిక రైతు సేవా సహకార సంఘం ఖాతాలో రూ.30 లక్షల దాకా గల్లంతయ్యాయి. ఆ డబ్బు ఎందుకు ఖర్చు చేశారనే వివరాలు నమోదు కాలేదు. ఇన్‌చార్జ్ సీఈఓ, చైర్మన్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారికి విచారణ అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యవసాయ సీజన్ (ఖరీఫ్, రబీ)లో రైతులకు ఎంతమేర ఎరువులు అవసరమవుతాయో తెలుసుకొని ముందస్తుగా మార్క్‌ఫెడ్, ఇఫ్కో, తదితర ఎరువుల సంస్థలకు సొసైటీ తరఫున ఇండెంట్ ఇస్తారు. ఈ మేరకు ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా వాటికి సొమ్ము జమ చేస్తుంది. అనంతరం సరఫరా చేసిన ఎరువులను అవసరమైన రైతులు కొనుగోలు చేస్తారు. వారు చెల్లించిన సొమ్మును ఒకటి, రెండు రోజుల్లో సీఈఓ సొసైటీ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇలా నిత్యం ఆ సంఘానికి దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జమవుతుంది. మొత్తంగా ఈ సొమ్ము రూ.40 లక్షల దాకా ఉంటుంది.
సొమ్ము డ్రా చేశారిలా..
సొసైటీలోని సొమ్మును తీసుకునేందుకు చైర్మన్ మహేష్ నాయుడు, ఇన్‌చార్జ్ సీఈఓ తారక బ్రహ్మానందరెడ్డికి మాత్రమే చెక్ పవర్ ఉంటుంది. దీనిని అదునుగా తీసుకున్న వారు ఏకంగా రూ. 30 లక్షల వరకు దశలవారీగా నగదు డ్రా చేసేశారు. ఓచర్ నంబర్ 66 ద్వారా 2026 మార్చి 31న రూ.7,48,000 డ్రా చేశారు. అనంతరం ఓచర్ 67 ద్వారా రూ.2500తో పాటు 2026 సెప్టెంబరు 19న రూ.22,76,280 డ్రా చేశారు. సంఘ కార్య కలాపాల తీరుపై ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోమవారం కార్యాలయానికి వచ్చిన తనిఖీ అధికారి జి.రమాదేవి ఆ నిధుల మళ్లింపును గుర్తించారు.
10 రోజుల్లో జమ చేయాలి
నిధుల దుర్వినియోగం విషయం బయటపడడంతో సొసైటీ చైర్మన్ మహేష్ నాయుడు అందుబాటులో లేకుండాపోయారు. విచారణ అధికారులు చైర్మన్‌కు సమాచారం తెలపండని సీఈఓతో ఫోన్ చేయించగా ఆయన ‘అనంతపురంలో ఉన్నా..రాలేను’ అని సమాధానం చెప్పారు. ఇన్‌చార్జ్ సీఈఓ కూడా నిధుల డ్రాపై ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు. దీంతో మొత్తం డబ్బులు పది రోజుల్లో జమ చేయాలని ఇన్‌చార్జ్ సీఈఓ, చైర్మన్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై మీడియా వివరణ కోరగా.. ఇవి అరోపణలు మాత్రమేనని, పూర్తిగా విచారణ చేసి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.


