అనంతపురం అర్బన్: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో తాగునీటి సమస్య, వ్యవసాయం, అక్షరాస్యత, తదితర అంశాలపై అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రాంతాలను గుర్తించాలన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతూ వాటితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సమస్య దృష్టికి వచ్చిన 24 గంటల్లోగా పరిష్కరించాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. ఎల్–నినోను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 100 శాతం అక్షరాస్యత శాతం సాధించే లక్ష్యంగా వయోజన విద్యా అధికారులు, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉపాధి పథకం కింద పనిచేసే వారిలో నిరక్ష్యరాసులను, పొదుపు సంఘాల్లో నిరక్షరాస్య మహిళలను గుర్తించి విద్యావంతులుగా మార్చాలని ఆయా శాఖల అధికారులనను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, డీఆర్‌డీఏ పీడీ శైలజ, జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, డ్వామా పీడీ సలీమ్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


