ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఖాళీగా ఉన్న 26 ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పట్టణ ప్రాంతాల్లో రెండు పోస్టుల భర్తీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 24 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 24లోపు ఆయా పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు https://ananthapuramu.ap. gov.in/ వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు.

రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారిగా దివాకర్‌

అనంతపురం అర్బన్‌: రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారిగా ఆర్‌ఎన్‌ దివాకర్‌రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. విజయవాడలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్ర కమిటీలో చోటుకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ కృష్ణమూర్తిని, దివాకర్‌రావును జిల్లా సంఘం నాయకులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ తనకు ఇంతటి బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమశేఖర్‌, ఉపాధ్యక్షుడు ముక్తియార్‌, కోశాధికారి పునీత్‌బాబు, డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు నారాయణస్వామి, రాజ్‌కుమార్‌, ఆదినారాయణ, సూర్యనారాయణ, చంద్రమోహన్‌, నాయకులు దినేష్‌, ఉదయ్‌లు పాల్గొన్నారు.

ఉత్కంఠ పోరులో

వెస్ట్‌ బెంగాల్‌ విజయం

అనంతపురం: స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఏపీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో డాక్టర్‌ తాలిమెరెన్‌ ఆవో అండర్‌–19 బాలికల నేషనల్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లో వెస్ట్‌బెంగాల్‌, ఒడిశా జట్లు గెలుపొందాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌, వెస్ట్‌బెంగాల్‌ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌లో 1–0 గోల్స్‌ తేడాతో వెస్ట్‌ బెంగాల్‌ జట్టు విజయం సాధించింది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన రెండో మ్యాచ్‌లో ఒడిశా, మహారాష్ట్ర జట్లు తలపడ్డాయి. మహారాష్ట్ర జట్టు ఒక గోల్‌ చేయగా, ఒడిశా జట్టు నాలుగు గోల్స్‌తో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అనంత క్రీడాగ్రామానికి చేరుకుంటున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లను ఏపీఎఫ్‌ఏ ప్రతినిధులు జి.అనిల్‌ కుమార్‌, సురేష్‌ మక్కె, సురేష్‌, జి.పవన్‌ కుమార్‌, దాసరి మల్లేష్‌, ఆర్‌ఎన్‌ శ్రీనివాస్‌, ఇర్షాద్‌ అలీ పరిశీలించారు.

అధికారులను దుర్భాషలాడిన వారిపై కేసు

బెళుగుప్ప: పీజీఆర్‌ఎస్‌లో ఈ.కాంతమ్మ ఇచ్చిన వినతి విచారణ నిమిత్తం గ్రామానికి వెళ్లిన అధికారులను దుర్భాషలాడిన కాలువపల్లి వాసులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కాంతమ్మ వినతి విచారణ నిమిత్తం శనివారం గ్రామానికి వెళ్లిన సర్వేయర్‌ సందీప్‌, టీడీ గురుబ్రహ్మలపై అదే గ్రామానికి చెందిన బోయ నీలకంఠ, తమ్ముళ్లు సతీష్‌, ఓబుళపతి తదితరులు దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేశారని సర్వేయర్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌

ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్‌ లోతేటి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు సెల్‌: 8977716661కి ఫిర్యాదు చేయాలన్నారు. వినియోగదారులు విద్యుత్‌ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని తెలియజేశారు.

జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ: అనంతపురం జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు ఫోన్‌ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement