కూడేరు: కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆదివారం వేకువజామున నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. స్థానిక పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న పంప్ హౌస్‌లో మోటార్లను బంద్ చేసి తాగునీటి సరఫరాను నిలిపివేశారు. ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణభారంగా ఉందని శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొర్రకోడు ఎర్రిస్వామి, కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌లో 600 మంది కార్మికులు పని చేస్తున్నామన్నారు. వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. కార్మిక సంఘం నాయకులు నారాయణ స్వామి, రమేష్, వన్నూరు స్వామి, రాజా, నేసే ఎర్రిస్వామి, సుధాకర్ పాల్గొన్నారు.
కార్మికులంటే కాంట్రాక్టర్‌కు అలుసా?
తాగునీటి సరఫరా పథకంలో చాలీచాలని వేతనాలతో పని చేసే కార్మికులంటే కాంట్రాక్టర్లకు అలుసా అని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు మండిపడ్డారు. ఆదివారం న్యాయపరమైన డిమాండ్ల సాధనకు శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్‌లో పని చేసే కార్మికులు పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న ప్రాజెక్ట్ పంప్‌హౌస్ వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. వారికి మద్దతుగా వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, సత్యసాయి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి మద్దతు పలికారు.


