బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

నార్పల: బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని నల్లపరెడ్డి పల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... మండల పరిధిలోని నల్లపరెడ్డిపల్లికి చెందిన ఆర్‌.రామ్మోహన్‌ (52), అతని స్నేహితుడు కృష్ణమూర్తి శుక్రవారం సాయత్రం సొంత పని నిమిత్తం తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామానికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి బయలుదేరారు. నల్లపరెడ్డి పల్లి సమీపంలో చెరువు కట్ట వద్ద రోడ్డుపై నిలిచిన బురదలో బైకు అదుపుతప్పడంతో ఇద్దరూ కింద పడ్డారు. గ్రామస్తులు ఇద్దరినీ బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించగా, రామ్మోహన్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ రామ్మోహన్‌ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామ్మోహన్‌ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మహిళ ఆత్మహత్య

తాడిపత్రిటౌన్‌: తాడిపత్రి పట్టణంలోని ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న సునీత (40) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సునీత, విజయ్‌ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. పెద్దమ్మాయి ఇడుపుల పాయ ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. విజయ్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా సునీత అనారోగ్యంతో బాధపడుతోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో మనోవేదనకు గురైన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

● సునీతకు చికిత్సల నేపథ్యంలో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, దీంతో అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో పాటు కాపురంలో కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పేర్కొన్నారు.

ఆంధ్ర జట్టుకు భంగపాటు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఏపీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న డాక్టర్‌ తాలిమెరెన్‌ ఆవో అండర్‌–19 బాలికల జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. శనివారం ఉదయం కర్ణాటక, ఏపీ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. కర్ణాటక జట్టు క్రీడాకారులు ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. కర్ణాటక జట్టు 7 గోల్స్‌ సాధించగా, ఏపీ జట్టు ఒక్క గోల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

జూటూరు తులసీదాస్‌కు అరుదైన గుర్తింపు

యల్లనూరు: జిల్లాకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త జూటూరు తులసీదాస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. మహారాష్ట్ర రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రూపొందించిన నాలుగో తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఆయన రచించిన ‘సంఘీభావం’ కథను చేర్చారు. బాలసాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న జూటూరు తులసీదాస్‌ గురుశతకం (2017), అమ్మ నేర్పిన అక్షర గేయాలు (2017), ముత్తెపు చినుకులు (2018), ఎర్రకోటలో తెల్లసిపాయిలు (2019), కాకులు దూరని కారడవి (2019) పేరుతో రచించిన పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు మహారాష్ట్ర పాఠ్యాంశాల్లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని మండల ఎంఈఓలు చంద్రశేఖర్‌, పరమేశ్వరరెడ్డి, శ్రీదేవి, ప్రేమ్‌ కుమార్‌లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement