● కలెక్టర్ ఆనంద్
అనంతపురం సిటీ: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆదాయ పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. అనంతపురంలోని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయాన్ని శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీటీడీ నెక్ట్స్‌జెన్ పోర్టల్ పనితీరును కలెక్టర్‌కు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వివరించారు. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్, రిటర్నుల దాఖలు, పరిశీలన, బకాయిల వసూళ్లు తదితర ప్రక్రియలను సమీకృత డిజిటల్ వేదిక ద్వారా చేపట్టిన విధానాలను ప్రదర్శించారు. వాణిజ్య పన్నుల శాఖలో కీలకంగా వినియోగిస్తున్న మూడు ఏఐ ఆధారిత మాడ్యూళ్ల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. జీఎస్టీ బకాయిలు, ఆస్తుల సమాచార మాడ్యూల్ ద్వారా బకాయిపడిన డీలర్ల చర, స్థిరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని, వివిధ వనరుల నుంచి సమీకరించి జప్తు చేయదగిన ఆస్తులను గుర్తించే విధానాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వివరించారు. లీగల్ ఏఐ మాడ్యూల్ పనితీరును కూడా కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత చట్ట నిబంధనలు, సర్క్యులర్లు, గత కేసుల చట్టపరమైన తీర్పులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కౌంటర్ అఫిడవిట్లు, ప్రత్యుత్తరాల తయారీలో అధికారులకు ఈ మాడ్యూల్ సహకరిస్తున్న విధానాన్ని గుర్తించారు.
జవాబుదారీతనం పెరగాలి
ఆదాయ పన్ను బకాయిల వసూళ్లు, న్యాయపరమైన కేసుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పన్నుల పరిపాలనలో ఏఐ వినియోగం పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కీలక ముందడుగు వేయాలన్నారు. డేటా ఆధారిత విధానాలను సమర్థవంతంగా వినియోగించి ఆదాయాన్ని పెంచాలన్నారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ అనంతపురం సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ పి.మౌనిక, అసిస్టెంట్ కమిషనర్ కె.రాకేష్, కళ్యాణదుర్గం అసిస్టెంట్ కమిషనర్ బి.సునీత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


