● విద్యుదాఘాతంతో జార్ఖండ్ చెందిన అన్నదమ్ముల దుర్మరణం
బుక్కరాయసముద్రం: పొట్టకూటి కోసం జార్ఖండ్ నుంచి జిల్లాకు వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు 11 కేవీ విద్యుత్ లైను పనులు చేస్తూ ఆ తీగలపైనే ప్రాణాలు వదిలారు. ఎల్‌సీ ఇవ్వడంలో విద్యుత్ లైన్‌మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటన శనివారం బుక్కరాయసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బుక్కరాయసముద్రం మండలం వడియంపేట, రేగడి కొత్తూరు, పొలాల్లో కాంట్రాక్టర్ అమర్‌నాథ్‌రెడ్డి 11 కేవీ విద్యుత్ లైను వేసే పనులు చేపడుతున్నారు. ఇతని వద్ద జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రధాన్ భందర (28), అతని తమ్ముడు నానో బాణర (25) ఏడాది కాలంగా కూలి పనులు చేస్తున్నారు. రోజూవారీగా వచ్చిన కూలి డబ్బులు పోగుచేసి స్వగ్రామంలోని తల్లిదండ్రులకు పంపిస్తూ ఉండేవారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
రేగడి కొత్తూరు గ్రామంలో రైతుల పొలాల్లో భందర్, బాణర శనివారం విద్యుత్ లైన్లు లాగే పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వడియంపేట హైవే సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పొలంలో లైన్ లాగేందుకు సిద్ధమయ్యారు. దీంతో వడియంపేట గ్రామంలో ఎల్‌సీ ఇవ్వాలని వర్క్ చేయించే అశోక్ లైన్‌మెన్ వెంకటేష్‌కు ఫోన్ చేశాడు. దీంతో ఆ పొలం పొడరాళ్ల గ్రామం ఫీడర్‌కు వస్తుందని, ఆ ఫీడర్ చూసే వారికి ఫోన్ చేయాలని సూచించాడు. అయితే తాము వర్క్ చేస్తున్న లైన్‌కు ఎల్‌సీ ఇచ్చారని భావించి భందర్, బాణరలు విద్యుత్ తీగలు లాగేందుకు వైర్లను తాకారు. వెంటనే ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో లైన్‌మెన్ వెంకటేష్, వర్క్ చేయిస్తున్న అశోక్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలానికి బీకేఎస్ సీఐ సుబ్బరాయుడు చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన భందర్, బాణర


