తారస్థాయికి వర్గపోరు | - | Sakshi
Sakshi News home page

తారస్థాయికి వర్గపోరు

Sep 9 2026 12:29 AM | Updated on Sep 9 2026 12:29 AM

అనంతపురం టౌన్‌: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుతోంది. త్వరలో జరగనున్న అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు చెక్‌ పెట్టేలా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి తనదైన శైలిలో వ్యూహాలు పన్నుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం కష్టపడి పని చేసిన మైనార్టీలు, బలిజ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు దగ్గుపాటికి దూరంగా ఉన్నారు. అలాంటి నేతలను వైకుంఠం తనవైపు తిప్పుకునేలా రాజకీయం నెరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మసీద్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారు. శ్రీనగర్‌కాలనీలో ఆదివారం మసీదు శంకుస్థాపన సందర్భంగా కేఎం షకీల్‌షఫీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ హాజరయ్యారు.

అసమ్మతి నేతలతో అలా జతకట్టి..

దగ్గుపాటికి వ్యతిరేకంగా ఉన్న బలిజ సామాజికవర్గ టీడీపీ ముఖ్య నాయకులతో పాటు ముస్లిం మైనార్టీ నేతలు ఆదివారం శ్రీనగర్‌ కాలనీలో జరిగిన మసీదు శంకుస్థాపనకు హాజరయ్యారు. వారందరినీ వైకుంఠం ప్రభాకర్‌చౌదరి ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. వారు కూడా చౌదరిని పొగడ్తలతో ముంచెత్తారు. 2024 ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్‌ గెలుపు కోసం పనిచేసిన టీడీపీ సీనియర్‌ నాయకుడు రాయల్‌ మురళిని ఎన్నికల అనంతరం దూరంగా పెట్టారు. టౌన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జేఎల్‌ మురళి, మైనార్టీ నాయకులతోపాటు బీసీ నేతలు ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన అత్యంత సీనియర్‌ నాయకులు జిల్లా మాజీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తితోపాటు ఎమ్మెల్యేకు అన్నీ తానై నడిపించిన గంగారం, ఏపీఐఐసీ డైరెక్టర్‌ ఇలా అనేక మందిని ఎమ్మెల్యే దూరం పెట్టారు. అలాంటి వారందరినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి రాజకీయాలు చేయడం మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గీయులకు మేయర్‌ పదవి రాకుండా చెక్‌ పెట్టే విధంగా వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిని పొగడ్తలతో ముంచెత్తుతూ విందు రాజకీయాలకు తెరలేపారు. అందులో భాగంగానే నెల రోజుల కిందట జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చమన్‌సాబ్‌ ఇంటిలో ఆయన తనయుడు ముక్తియార్‌ ఇచ్చిన విందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యతిరేక వర్గం పాల్గొంది. మైనార్టీలు, బలిజలు ఒకతాటిపైకి వచ్చి వచ్చే ఎన్నికల్లో దగ్గుపాటికి వ్యతిరేకంగా తమ సత్తా ఏమిటో చాటి చెప్పే విధంగా ముందుకు వెళ్లాలని చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దగ్గుపాటి – ప్రభాకర్‌చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. రెండేళ్ల పాలనపై వైకుంఠం ప్రెస్‌మీట్‌ పెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దగ్గుపాటి పెద్ద ఎత్తున దందాలు, భూ అక్రమాలకు పాల్పడి రూ.వందల కోట్లు దోచుకున్నాడని దుమ్మెత్తిపోశారు. అధికార పార్టీలో రగులుకున్న అసమ్మతి పోరు ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.

సామాజికవర్గమంతా దూరమే..

ఎమ్మెల్యే దగ్గుపాటి నుంచి తనకు ప్రాణహాని ఉందని గతంలోనే ‘లిక్కర్‌’ సుధాకర్‌నాయుడు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేతో విభేదించి వైరి వర్గంగా కొనసాగుతున్నాడు. ఇక మున్సిపాలిటీ పరిధిలోని కాంట్రాక్టులన్నీ దగ్గుపాటి ఇన్‌ఫ్రాకు అప్పగించడంపై శ్రీనివాసచౌదరి అనే కాంట్రాక్టర్‌ ఇటీవల ఆర్‌టీఐ యాక్ట్‌ కింద వివరాలు అడిగాడు. అసలు సీనియార్టీ లేని దగ్గుపాటి ఇన్‌ఫ్రాకు పనులు ఎలా కేటాయించారని అందులో ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ఫోన్‌ ద్వారా మంతనాలు నడిపాడు. ఆ ఫోన్‌కాల్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే భార్య శ్రీనివాసచౌదరిపై నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన అతను..రెండు రోజుల కిందట హైకోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకున్నాడు.

ఫ్లెక్సీ కడితేనే డీలర్‌షిప్‌

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ పెద్దలు స్టోర్‌ డీలర్‌ షిప్‌లన్నీ ‘తమ్ముళ్ల’కే ఇప్పించారు. దీంతో డీలర్ల వల్ల తనకేమీ లాభం లేదని భావించిన ఎమ్మెల్యే దగ్గుపాటి తన జన్మదినం.. ఇతరత్ర కార్యక్రమాల సమయంలో తన ఫొటోతో ప్రతి డీలరూ కనీసం 5 బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టాలని హుకుం జారీ చేశారు. అంతేకాకుండా సదరు ఫ్లెక్సీ ఫొటో, వీడియో పెట్టాలని ఆదేశించారు. లేకపోతే డీలర్‌షిప్‌ రద్దవుతుందని హెచ్చరించారు. దీంతో డీలర్లంతా ఇష్టం లేకపోయినా టీడీపీ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే ఇంటి ఫంక్షన్ల వేళ ఒక్కో ఫ్లెక్సీ రూ. 6 వేల చొప్పున ఖర్చు చేసి ఫెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై డీలర్లంతా ఇప్పటికే తమ గోడును టీడీపీ పెద్దల వద్ద వెళ్లబోసుకున్నారు.

ఎమ్మెల్యే దగ్గుపాటికి

చెక్‌ పెట్టేలా వ్యూహాలు

అసమ్మతి నేతలను

కూడగడుతున్న ‘వైకుంఠం’

మసీద్‌ శంకుస్థాపన వేదికగా పావులు కదిపిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement