గుంతకల్లు రూరల్: మండల పరిధిలోని ఓబుళాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మైనాపురం గ్రామంలో రైతు వెంకటేష్‌కు చెందిన తోటలోకి ఆదివారం రాత్రి దుందగులు చొరబడి చీనీ చెట్లను నరికివేశారు. రైతు వెంకటేష్ తన 9.5 ఎకరాల పొలంలో నాలుగు సంవత్సరాల క్రితం చీనీ తోట సాగు చేశాడు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఈ ఏడాది మొదటికోతను తీయాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి జేసీబీతో చొరబడి మొక్కలపై ఇష్టారాజ్యంగా నడిపిస్తూ 200 మొక్కలను నాశనం చేశారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు వెంకటేష్ చీనీ మొక్కలు నేలకు ఒరిగి ఉండటాన్ని గమనించి హతాశుడయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనాపురం గ్రామానికి చెందిన శేఖర్‌కు, తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఈ విషయంలో ఆదివారం అర్ధరాత్రి శేఖర్ తనకు ఫోన్ చేసి దుర్భాషలాడాడని బాధితుడు తెలిపాడు. శేఖర్ తన జేసీబీతో ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించాడు.
బైకును ఢీకొన్న టిప్పర్..
వృద్ధురాలి మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
బత్తలపల్లి: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన వెంకటరమణ, అతని తల్లి లక్ష్మీనారాయణమ్మ (60) ద్విచక్రవాహనంలో తాడిపత్రికి వెళుతున్నారు. మార్గమధ్యంలో మండల పరిధిలోని పోట్లమర్రి ఆంజనేయస్వామి ఆలయం వద్ద టిప్పర్ వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణమ్మ మృతి చెందగా, వెంకటరమణ చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న బత్తలపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
●బత్తలపల్లి నుంచి ధర్మవరం వైపు వెళ్లే టిప్పర్ల వేగానికి అంతేలేకుండా పోతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇసుక, బంకమట్టి, కంకర లోడుతో వెళ్లే టిప్పర్లకు స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా ఏమాత్రమూ అడ్డూఅదుపు ఉండదన్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


