గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో సోమవారం వేకువజామున ఓ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నుంచి బెంగళూరులోని మాలూరుకు ఆలు గడ్డల లోడుతో లారీ బయలుదేరింది. కొత్తపేట గ్రామ శివారులోకి రాగానే సర్వీస్ రోడ్డులో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగి లారీపై పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంపై అనుమానాలు
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు లారీ హైవే మీదుగా వెళ్లాలి. అయితే సర్వీస్ రోడ్డులోకి రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి డ్రైవర్, క్లీనర్‌లు అదృశ్యమయ్యారు. పొరపాటుగా లేదా నిద్రమత్తులో లారీని సర్వీస్ రోడ్డులోకి తిప్పి ఉంటే ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్, క్లీనర్ అక్కడే ఉండేవారు. దీనిపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేలుడు పదార్థాలు తీసుకెళ్తూ మంటలు రావడంతో డ్రైవర్ లారీని కావాలనే సర్వీస్ రోడ్డులోకి తీసుకెళ్లి పల్టీ కొట్టించాడా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


