జారీ చేసిన చెక్కు రీకాల్‌ | - | Sakshi
Sakshi News home page

జారీ చేసిన చెక్కు రీకాల్‌

Sep 6 2026 12:43 AM | Updated on Sep 6 2026 12:43 AM

సాక్షి ప్రతినిధి, అనంతపురం/న్యూటౌన్‌: టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ‘పచ్చ’ కాంట్రాక్టర్లు సైతం రెచ్చిపోతున్నారు. చేయని పనులకు సైతం అక్రమంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తే ‘నీ దిక్కున్న చోట చెప్పుకో.. ప్రభుత్వం మాది’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

అర్హత లేకున్నా అందలం ఎక్కిన వైనం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీర్చేందుకు నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పథక నిర్వహణ కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు టెండర్‌ పిలుస్తుంటారు. పనులు చేపట్టేందుకు వార్షిక టర్నోవర్‌ రూ.16 కోట్లతో పాటు నీటి ప్రాజెక్టుల నిర్వహణలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. కానీ.. ప్రకాశం జిల్లాకు చెందిన అడపా వెంకట్రావుకు చెందిన సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.4 కోట్లలోపు, నీటి ప్రాజెక్టుల నిర్వహణలో అనుభవం ఆరు నెలలు మాత్రమే ఉన్నప్పటికీ ‘ముఖ్య’ నేత అండదండలు ఉన్నాయని అధికారులను భయపెట్టి పనులు దక్కించుకున్నాడు. 1.9.2025 నుంచి తిరిగి పథకం నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో పథకం అమలులో గోల్‌మాల్‌ వెలుగులోకి వచ్చింది. ఈ అడ్డగోలు దోపిడీలో ‘అడపా’కు కొందరు అధికారుల సహకారమూ ఉన్నట్లు తెలుస్తోంది.

‘పచ్చ’ నేతల అండదండలతో ..

తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయడంలో అడపా వెంకటరావు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. వేతనాలను బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉన్నప్పటికీ... చేతికి డబ్బులిచ్చి ‘ఇదే మీ జీతం’ అని చెప్పి పంపిస్తున్నారు. రికార్డుల్లో రూ.16 వేలు ఉన్న కార్మికులకు రూ.14 వేలు, రూ.14 వేలు ఉన్నవారికి రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ‘ఉద్యోగం కావాలా.. జీతం కావాలా’ అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పచ్చ’ నేతల అండ చూసుకుని అడపా సాగిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై ఇప్పటికే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

బెంబేలెత్తుతున్న అధికారులు

అడపా అక్రమాలను కళ్లారా చూస్తున్నా ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రజా సంఘాలు, కార్మికులు అడపా అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే.. ‘అతను మా స్థాయి కాదు.. అతనిపై చర్యలు తీసుకుంటే మాకు ఇబ్బందులు తప్పవు’ అంటూ నిస్సహాయతను ప్రదర్శిస్తున్నారు. అధికారులను సైతం అడపా వెంకట్రావు తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తారని, ఏమైనా అభ్యంతరాలు చెబితే ‘ల’ కారంతో తిడతారని సిబ్బంది చెబుతున్నారు. తనకు ‘ముఖ్య’ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఏమైనా తోక జాడిస్తే మీ ఉద్యోగాలే ఊడతాయని అడపా బెదిరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో భారీగా గోల్‌మాల్‌

టీడీపీ ముఖ్య నేత అండదండలతో రెచ్చిపోతున్న అడపా వెంకటరావు

ఇటీవల అక్రమంగా రూ.43 లక్షల చెక్కు జారీ చేయించుకున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement