ఆర్‌ఎంపీ కేంద్రాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ కేంద్రాల్లో తనిఖీలు

Sep 6 2026 12:43 AM | Updated on Sep 6 2026 12:43 AM

అనంతపురం సిటీ: ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలోని నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యులు డాక్టర్‌ సుబ్బానాయుడు, డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి, డాక్టర్‌ కురువ శ్రీహరి శనివారం అనంతపురంలోని పలు ఆర్‌ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. విషయం తెలియగానే పలువురు ఆర్‌ఎంపీలు తమ కేంద్రాలకు తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అందుబాటులో ఉన్న నాలుగు ఆర్‌ఎంపీ కేంద్రాలను బృందం సభ్యులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయా కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లుగా తమ పరిశీలనలో గుర్తించినట్లు తెలుస్తోంది. శాసీ్త్రయ ఆధారాలు లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా మోసపూరిత వైద్య విధానాలను అవలంబిస్తున్న పాతూరులోని మేఘన ప్రథమ చికిత్స కేంద్రం (జి.రమణ), రామ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ వద్ద ఉన్న శ్రీసాయి క్లినిక్‌ (డాక్టర్‌ ఎస్‌.నాగేంద్రకుమార్‌), ఆర్టీఓ కార్యాలయం మార్గంలోని సూపర్‌ కే మాల్‌ వద్ద ఉన్న సప్తగిరి ప్రథమ చికిత్స కేంద్రం (డాక్టర్‌ రమేష్‌), కళ్యాణదుర్గం రోడ్డులోని మహబూబ్‌ ప్రథమ చికిత్స కేంద్రం (ఎండీ బాషా, వి.మనోహర్‌) నిర్వాహకులపై నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో వీరిపై చర్యలకు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌కు నకిలీ డాక్టర్ల నిరోధక కమిటీ సభ్యులు సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది.

9న ఎస్టీ కమిషన్‌

చైర్మన్‌ పర్యటన

అనంతపురం అర్బన్‌: షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) కమిషన్‌ చైర్మన్‌ సొల్ల బొజ్జిరెడ్డి ఈ నెల 9న జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్‌ ఆనంద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తేదీ రాత్రి అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి ఆయన చేరుకుంటారని, 9న ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గిరిజన సంఘాల నాయకులు, గిరిజనుల నుంచి అరీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఉదయం 9.45 స్థానిక నవోదయ కాలనీ వద్ద ఉన్న ఏకలవ్య విగ్రహం వద్ద చేరుకుని పుష్పాంజలి ఘటిస్తారని తెలిపారు. ఉదయం 10.45 గంటలకు పామిడి మండలం పాలెం తండాకు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు గిరిజనులతో మాట్లాడతారని, అదే విధంగా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కలెక్టరేట్‌ చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులతో సమీక్షిస్తారన్నారు.

డిమాండ్లు

నెరవేరే దాకా ఉద్యమం

జేఏసీ అమరావతి చైర్మన్‌ దివాకర్‌రావు

అనంతపురం అర్బన్‌: ‘‘మేము కొత్తగా ఏమీ అడగడం లేదు. పనిచేసిన కాలానికి రావాల్సిన జీతాలు, భత్యాలు, బకాయిలే అడుగుతున్నాం. మా డబ్బులు మాకు ఇవ్వండి. డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదు’’ అని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ ఆర్‌.ఎన్‌.దివాకర్‌రావు అన్నారు. జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ‘డిమాండ్స్‌ డే’లో భాగంగా శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌ ఆవరణలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం తమకు లభించిన తొలి విజయమన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలనే ఉద్యోగులు ప్రధానంగా కోరుకుంటున్నారన్నారు. వెంటనే పీఆర్‌సీ కమిషనర్‌ నియమాకం, మధ్యంతర భృతి, పెండింగ్‌ డీఏలు, ఇతర ఆర్థిక బకాయిలు చెల్లించాలన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ అమరావతి జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వెంకటశివప్రసాద్‌, మహిళా విభాగం చైర్‌పర్సన్‌ సురేఖరావు, ఎస్సీ మునిసిపల్‌ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అజయ్‌బాబు, వీఆర్‌ఏ సంఘం అధ్యక్షుడు ఓబులేసు, వైద్యారోగ్యశాఖ సంఘం నాయకుడు కోదండరామిరెడ్డి, నాయకులు గోవిందునాయక్‌, మంజునాథ్‌, రామకృష్ణ, నాగేంద్ర, అబ్దుల్‌, అధికారుల, ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement