రాప్తాడు రూరల్: పంటలకు నీరు పెట్టుకోవాల్సిన సమయంలో కరెంటు కోసం రైతులు అర్ధరాత్రి రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. రాప్తాడు మండలం హంపాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు హంపాపురం, గొల్లపల్లి, యర్రగుంట, గొందిరెడ్డిపల్లి గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి అవసరమైన త్రీఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా చేయడం లేదంటూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా విద్యుత్ సరఫరా సరిగా లేదని రైతులు వాపోయారు. వారం రోజులుగా పగటిపూట మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని, రాత్రివేళల్లో కోత విధిస్తున్నారని తెలిపారు. రెండు రోజుల నుంచి పూర్తిగా విద్యుత్ సరఫరానే నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బోర్లు పనిచేయక పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ సమస్యపై ఎమ్మెల్యే పరిటాల సునీతతోపాటు ఆమె సోదరులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆరోపించారు. ఓ వైపు ఎల్–నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ఉన్న నీటిని పంటలకు అందించేందుకు కూడా విద్యుత్ లేకపోవడం దారుణమని మండిపడ్డారు. పంటలు కళ్లముందే ఎండిపోతుంటే అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా విద్యుత్ అధికారులు స్పందించి హంపాపురం సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయానికి నిరంతరాయంగా త్రీఫేజ్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ అంతరాయంపై నిరసన
డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): డి.హీరేహాళ్ మండలం గొడిసెలపల్లి సబ్‌స్టేషన్‌ను శనివారం రైతులు ముట్టడించి నిరసన తెలిపారు. వ్యవసాయ మోటర్లకు త్రీఫేజ్ కరెంటు ఇవ్వకుండా సింగిల్ ఫేజ్ ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గెణిగెర, జక్కలవడికి, బాదనహాళ్, అంబాపురం తదితర గ్రామాల రైతులు ఏకరువు పెట్టారు. మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వరి, మొక్క జొన్న, వేరుశనగ, మిరప తదితర పంటలకు కీలక సమయంలో నీరు అందక దెబ్బతినే పరిస్ధితి నెలకొందని వాపోయారు. విద్యుత్ సమస్యను పరిష్కరించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అధికారులను హెచ్చరించారు.
హంపాపురం, గొడిసెలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు


