గుంతకల్లు: స్థానిక తాటాకుల వీధికి చెందిన రాజేశ్వరి (33) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి బోయ లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజేశ్వరికి 15 ఏళ్ల క్రితం నేమకల్లు మద్దిలేటితో వివాహం జరిగింది. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఈ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అప్పులు ఎక్కువగా ఉన్నాయంటూ తల్లి లక్ష్మీదేవితో రాజేశ్వరి చెప్పుకుంటూ బాధపడుతుండేది. శనివారం ఉదయం సెంట్రింగ్ పనికి మద్దిలేటి వెళ్లగా.. చిన్న కుమారుడు స్కూల్‌కు వెళ్లాడు. పెద్ద కుమారుడు శ్యామ్‌కుమార్ కూడా బయటకు వెళ్లిన సమయంలో జీవితంపై విరక్తి చెందిన రాజేశ్వరి బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అప్పడే ఇంటికి వచ్చిన కుమారుడు శ్యామ్‌కుమార్ బెడ్ రూమ్ తలుపులు ఎంత కొట్టినా రాజేశ్వరి తెరవకపోవడంతో సమీపంలోనే ఉన్న మామ కృష్ణకు చెప్పాడు. ఆయన తలుపులు పగులగొట్టి వెంటనే రాజేశ్వరిని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
11 నుంచి ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. సుబేధార్‌గంజ్ జంక్షన్‌లో రైలు (04135) ఈ నెల 11 నుంచి డిసెంబర్ 04 వరకు ప్రతి శుక్రవారం (13 సర్వీసులు) రాత్రి 9.20 గంటలకు బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా యశ్వంతపూర్ జంక్షన్ నుంచి రైలు (04136) ఈ నెల 14 నుంచి డిసెంబర్ 17 వరకు ప్రతి సోమవారం (13 సర్వీసులు) ఉదయం 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైళ్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, రాయచూర్, కృష్ణ, యాదగిర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, ఖాజీపేట, మంచిర్యాల, మాల్లంపల్లి, కాగజ్‌నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.
బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు
ఉరవకొండ: మండల పరిధిలోని పెద్దముస్టూరు గ్రామానికి చెందిన చరణ్‌తేజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ మహనంది యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన మేరకు.. బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించిన చరణ్‌తేజ్ గత నెల 10న బెంగళూరుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కోసం తల్లిదండ్రులు వెతుకుతున్న సమయంలో చరణ్ గత నెల 18న ఇంటి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


