● ఇంజక్షన్ వికటించి వృద్ధురాలి మృతి
అనంతపురం సిటీ/బ్రహ్మసముద్రం: ‘అయ్యో రామా.. ఎంత పని చేస్తివయ్యా!! ప్రాణం పోస్తారని ఆస్పత్రికి వస్తే ఊపిరి తీసేశారు కదయ్యా..?’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న కేసీ రామన్న ఆస్పత్రి ప్రాంతం దద్దరిల్లింది. ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి ప్రాణాలు బలిగొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లికి చెందిన చిత్రలింగప్ప, గుండమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. తమకున్న పొలంలో పంటల సాగుతో జీవనం సాగించేవారు. 16 ఏళ్ల క్రితం చిత్రలింగప్ప మృతి అనంతరం గుండమ్మనే ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. కొన్నేళ్లుగా ఆయాసంతో బాధపడుతున్న గుండమ్మ (60)కు అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న కేసీ రామన్న ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. మూడేళ్లుగా నెలకోసారి ఆమెను పిలుచుకొచ్చి చికిత్స చేయించుకుని వెళ్లేవారు. ఆయాసంతో పాటు జ్వరంతో బాధపడుతున్న గుండమ్మ శుక్రవారం తన కుమారుడు రామాంజనేయులు, మనవరాలు మేఘనతో కలిసి కేసీ రామన్న ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. ఈ లోపు కుటుంబసభ్యులతో కలసి బయట హోటల్‌కు వెళ్లి భోజనం చేస్తుండగా రామాంజనేయులుకు ఆస్పత్రి సిబ్బంది ఫోన్ చేశారు.
ఇంజక్షన్ వేసిన కొద్ది సేపటికే...
‘అమ్మకు ఇంజక్షన్ చేయాలని ఆస్పత్రి వాళ్లు ఫోన్ చేశారు. మీరు ఆస్పత్రి వద్దకెళ్లండి నేను బిల్లు కట్టేసి వస్తా’ అని రామాంజనేయులు తెలపడంతో గుండమ్మను పిలుచుకుని మనవరాలు కేసీ రామన్న ఆస్పత్రికి చేరుకుంది. ఆ సమయంలోనూ అక్కడ వైద్యులు ఎవరూ లేరు. డాక్టర్ చెప్పారంటూ నర్సు పిలుచుకెళ్లి ఇంజక్షన్ వేసింది. ఆ సమయంలో తీవ్రమైన మంట కలుగుతోందని గుండమ్మ చెప్పగా, భయపడాల్సిన పనేమీ లేదంటూ నర్సు చెప్పింది. ఈ క్రమంలోనే గుండమ్మ కళ్లు తేలేసింది. అక్కడే ఉన్న మనమరాలు వెంటనే నర్సులను అప్రమత్తం చేసినా ఫలితం లేకపోయింది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపకుండా అంబులెన్స్‌ను రప్పించుకుని సర్వజనాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండమ్మ మృతి చెందినట్లు నిర్ధారించి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
పోలీసు కేసు నమోదు..
గుండమ్మ కుటుంబసభ్యులు శనివారం ఉదయం కేసీ రామన్న ఆస్పత్రి నిర్వాహకులను నిలదీశారు. తమ తప్పిదమేమీ లేదని, సరైన చికిత్సను అందించామని, ఆరోగ్య పరిస్థితి విషమించినందు వల్లనే ఆమె మృతి చెందిందంటూ బుకాయించారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు వెంటనే నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టడంతో వైద్యుడి సూచన మేరకు ఇంజక్షన్ వేసిన తర్వాత వృద్ధురాలి పరిస్థితి విషమించి మృతి చెందినట్లుగా అక్కడి సిబ్బంది అంగీకరించినట్లు సమాచారం. ఘటనపై నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


