● దమ్ముంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మా సవాల్ స్వీకరించాలి
● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి తీరతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ చేశారు. వీలైతే ఆయన కూడా పోటీ చేయాలన్నారు. తాడిపత్రిలో మునిసిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపిస్తే ప్రజలు ఎవరి వైపు ఉన్నారో స్పష్టమవుతుందన్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీతో పాటు దౌర్జన్యాలు చేయడం, పోలీసులపై ఒత్తిడి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశాలు ఉంటే విడనాడాలని, కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించాలని హితవు పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు నమ్మి టీడీపీ నాయకులు మోసపోవద్దని సూచించారు. రెండు సంవత్సరాలు గడిచాక ప్రభుత్వం మారితే బెంగళూరుకో, హైదరాబాద్‌కో జేసీ వెళ్లిపోతాడనే విషయాన్ని గ్రహించాలన్నారు. జేసీకి దమ్ము, ధైర్యం ఉంటే సవాల్‌ను స్వీకరించి మునిసిపల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు. జేసీ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పులేనని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిల కుట్ర రాజకీయాలు ఇటీవల తీవ్రమయ్యాయని మండిపడ్డారు. తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో అలజడి సృష్టించేందుకు నీచ రాజకీయాలు చేయిస్తున్నారన్నారు. జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నా పోలీసులు ఫిర్యాదు ఎందుకు స్వీకరించరని ప్రశ్నించారు. బాధితుల పక్షాన నిలవకుండా నిందితులకు వత్తాసు పలకడమే పోలీసుల విధానమా.. అని నిలదీశారు. తాడిపత్రి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుంటే మంచిదని సూచించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు.
ఫోర్జరీ దొంగ జేసీ ప్రభాకర్ రెడ్డి..
తండ్రి కాలం నుంచే సంపన్నులమని చెప్పుకునే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్లు, అక్రమ రిజిస్ట్రేషన్లతో బీఎస్– 3 వాహనాలను బీఎస్–4గా మార్చి దొరికిన దొంగ అనే విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఆపాలని హితవు పలికారు.


