● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు
అనంతపురం టవర్‌క్లాక్: సత్యసాయి తాగునీటి పథకాన్ని శాశ్వతంగా కొనసాగించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోంలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి.ఓబులు మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన ఐదు నెలల వేతనాల కోసం 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. పుష్కరాలు , ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించే ప్రభుత్వం ప్రజల దాహం తీర్చే ఈ పథకానికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. పాతబడిన పైపులైన్లు, మోటర్లు, పంపింగ్, విద్యుత్ వ్యవస్థలను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు తక్షణం చెల్లించి సమ్మెకు పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీ నాయుడు, వైఎస్సార్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుసేన్ పీరా, గోవిందు, అనిల్ కుమార్ గౌడ్, రాజేష్ గౌడ్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప పాల్గొన్నారు.
నేడు, రేపు ‘సర్’ ప్రత్యేక క్యాంపెయిన్
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)కు సంబంధించి శని, ఆదివారాలు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎనికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐఆర్ (సర్) గడువు పొడిగించిన నేపథ్యంలో అదనపు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటరు నమోదు, వివరాల మార్పునకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని, ఓటర్లకు తలెత్తే సందేహాలను నివృత్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దర్గాలో 21 కిలోల వెండి మాయం
విడపనకల్లు: మండల పరిధిలోని వి.కొత్తకోటలోని బడేషావలి దర్గాలో 21 కిలోలు వెండి మాయం అయిన సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నాలుగు రోజు క్రితం దర్గాలో బడేషావలి ఉరుసు సందర్భంగా భక్తులు బడేషావలికి 27 కిలోలు వెండిని కానులకు రూపంలో సమర్పించారు. ఇందులో 21 కిలోలు వెండి మాయం అయినట్లు దర్గాకు సంబంధించి పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్గాకు సంబంధించి నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులను పోలీసులు విచారించగా వెండిని తీసుకెళ్లి కరించగా ఆరు కిలోలు వచ్చిందని, దాన్ని కర్నూలు జిల్లా ఆదోనికి తీసుకెళ్లి కరిగించి విక్రయించగా రు.15.18 లక్షలు వచ్చాయన్నారు. ఆ సొమ్మంతా కూడా బ్యాంకులో డిపాజిట్ చేశామని కమిటీ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై ‘సాక్షి’ ఎస్‌ఐ ఖాజాహుస్సేన్ వివరణ కోరింది. అయితే రాతపూర్వకంగా తమకు ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుత్తి: పట్టణ శివారులోని అనంతపురం రోడ్డులో సత్యసాయి వాటర్ పంప్ మౌస్ వద్ద శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సురేష్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.


