● రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికై న ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య జేఎన్‌టీయూ అనంతపురం సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్. ఆరు సంవత్సరాల పాటు రిజిస్ట్రార్‌గా సేవలు అందించారు.
అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం/గుత్తి/కళ్యాణదుర్గం రూరల్ : విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.. వారి భవిష్యత్‌కు బలమైన పునాది వేయడంలో గురువుల పాత్ర కీలకం. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న గురువులను గుర్తించి సత్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏటా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందిస్తోంది. ఇందులో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది జిల్లాకు చెందిన నలుగురు అధ్యాపకులు, ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు–2026కు ఎంపికయ్యారు. ఉత్తమ అధ్యాపక అవార్డులకు ఎస్కేయూ నుంచి ఒకరు, జేఎన్‌టీయూ అనంతపురం నుంచి ముగ్గురు ప్రొఫెసర్లు ఎంపికయ్యారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, జేఎన్‌టీయూ నుంచి మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, హ్యుమానిటీస్ విభాగం ప్రొఫెసర్ టి. నారాయణ రెడ్డికి అవార్డులు దక్కాయి. అలాగే, కళ్యాణదుర్గం మండలం కొండాపురం ఎస్టీ కాలనీ ఎంపీపీ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్. గోవర్ధన్, గుత్తి కేజీబీవీలో బయాలజీ సీఆర్‌టీగా పనిచేస్తున్న ఆర్. గౌరీ ప్రభాంజలి, గుత్తి మండలం చెట్నేపల్లి జెడ్పీ పాఠశాలలో బయాలజీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి. శామ్యూల్ ప్రతాప్‌ను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. ఈనెల 5న విజయవాడలోని ఎస్.లయోలా స్కూల్‌లో నిర్వహించనున్న వేడుకల్లో వీరు అవార్డులు అందుకోనున్నారు.
పాఠం చెప్పడం మాత్రమే కాదు.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, దానికి పదును పెట్టి, వారిని విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్.గౌరీ ప్రభాంజలి పనిచేస్తున్నారు. ముఖ్యంగా కౌశల్ పోస్టర్ ప్రజెంటేషన్‌లో ఆమె వద్ద శిక్షణ పొందిన విద్యార్థినులు మూడుసార్లు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇన్‌స్పైర్ సైన్స్ ఫెయిర్, సదరన్ సైన్స్ ఫెయిర్‌లలో పలుమార్లు విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌లోనూ ఆమె తీర్చిదిద్దిన విద్యార్థినులు పలుమార్లు రాష్ట్ర స్థాయికి ఎంపికై తమ ప్రతిభను చాటారు. విద్యార్థులకు సైన్స్ పాఠాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకు గౌరీ ప్రభాంజలి వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు.
జిల్లాకు చెందిన ఏడుగురు గురువులకు రాష్ట్ర స్థాయి అవార్డులు
నలుగురు అధ్యాపకులు, ముగ్గురు ఉపాధ్యాయుల ఎంపిక
విద్యా రంగానికి అందించిన సేవలకు గుర్తింపు


