● మాజీ మంత్రి సాకే శైలజానాథ్
శింగనమల: నీటి కేటాయింపులో వివక్ష చూపుతారా..? అంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శింగనమల నియోజకవర్గంలో ఉద్యాన పంటలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. తక్షణం మిడ్‌పెన్నార్‌కు నీరు వదలకుంటే చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సాగునీటి సలహా మండలి సమావేశంలో కేవలం కొన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు. మిగిలిన నియోజకవర్గాలు కనిపించలేదా అని నిలదీశారు. మిడ్ పెన్నార్ డ్యాం కింద 46 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా ఎందుకు నీరు కేటాయించలేదని ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గంలో రైతులు, ప్రజలు సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిరక్ష్యంగా వ్యవహరి స్తోందని మండిపడ్డారు. గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. సాగు నీరు రాకపోతే భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు వట్టిపోతాయన్నారు. ఇప్పటికైనా స్పందించి నీటి సమస్యకు పరిష్కారం చూపకపోతే రైతులు, ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
● యథేచ్ఛగా బియ్యం దందా
● తక్కువకు కొని.. ఎక్కువకు అమ్మి..
● జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో
జోరుగా వ్యాపారం
● కర్ణాటక రాష్ట్రానికి తరలించేందుకు డి.హీరేహాళ్ మండలం జాజరకల్లు శివారులోని బీడు భూమిలో 50 కిలోలవి 280 ప్యాకెట్లు (14 టన్నులు) చౌక బియ్యాన్ని అక్రమంగా నిల్వచేశారు. వాటిని ఆగస్టు 18న పౌర సరఫరాల అధికారి శోభారాణి నేతృత్వంలో తహసీల్దారు శ్రీనివాసులు, ఎస్‌ఐ గురుప్రసాద్ రెడ్డి, సీఎస్‌డీటీ సుబ్రహ్మణ్యం, ఇతర సిబ్బంది దాడి చేసి స్వాధీనం చేసుకుని, రాయదుర్గం ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు.
● ఈ ఏడాది ఏప్రిల్ 13న గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద బీడు భూమిలో 50 కిలోలవి 88 ప్యాకెట్ల (4.4 టన్నులు) చౌక బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు దాడిచేసి, స్వాధీనం చేసుకున్నారు.
● తక్కువ ధరకు నాణ్యమైన సోనామసూరి బియ్యం అంటూ ప్రజలను నమ్మించి ఆగస్టు 26న ఉరవకొండలో కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని ప్రజలకు అంటగట్టారు. ఆలస్యంగా గుర్తించిన కొనుగోలుదారులు లబోదిబోమన్నారు.
గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద
బీడు భూమిలో డంప్ చేసిన చౌక బియ్యం (ఫైల్)
అనంతపురం అర్బన్: ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా పేదలకు అందే బియ్యం నల్లబజారు (బ్లాక్ మార్కెట్)కు తరలుతున్నాయి. బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. రేషన్ బియ్యం తక్కువ ధరకు సేకరించి, బయటి ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యాపారం జోరందుకుంది. కొందరు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం నొక్కేస్తూ వ్యాపారులకు అమ్ముతున్నట్లు తెలిసింది. మరికొందరు డీలర్లు కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం.
రూ.15కి కొని.. రూ.50కి అమ్ముతూ..
పేదల ఆర్థిక అవసరాలను అక్రమార్కులు తమకు అనుకూలంగా చేసుకుని.. వారి నుంచి కిలో రేషన్ బియ్యం రూ.15తో కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో కర్ణాటక సరిహద్దున ఉన్న గ్రామాల్లో ఈ దందా జోరుగా సాగిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని 50 కేజీల సంచుల్లో ప్యాక్ చేసి బళ్లారి, బెంగళూరు, బంగారుపేట, పావగడ, చిక్‌బళ్లాపూర్, తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో బియ్యం కిలో రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
తొందరపడి కొనుగోలు చేయొద్దు
అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని కొత్తసంచుల్లో ప్యాక్ చేసి.. తక్కువ ధరకు నాణ్యమైన సోనామసూరి అంటూ అమాయకులకు అంటగడుతున్నారు. ఈ విషయంలో ప్రజలు తొందరపడరాదు. బియ్యం తక్కువ ధరకు వస్తున్నాయని ఎక్కడపడితే అక్కడ కొనుగోలు చేయరాదు. దుకాణాలు, రైస్ మిల్లులు, రైతులు, స్థానికంగా ఉండే బియ్యం వ్యాపారుల నుంచి కొనుగోలు చేయాలి.
క్రిమినల్ కేసులు నమోదు
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లా నుంచి రవాణా జరిగే మార్గంలో నిఘా పెట్టాం. విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు దాడులు నిర్వహిస్తూ అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం పట్టుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 25 కేసులు నమోదు చేశాం. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. – శోభరాణి,
జిల్లా పౌర సరఫరాల అధికారి


