ఘనంగా సీతారాముల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సీతారాముల కల్యాణం

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

బొమ్మనహాళ్‌: ప్రసిద్ధి చెందిన నేమకల్లు ఆంజనేయస్వామి బాలాలయంలో గురువారం సీతారాముల కల్యాణాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌స్వామి ఆధ్వర్యంలో వేకువజామున స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం సీతారాముల విగ్రహాలను పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెగా ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చారు. వేద మంత్రాల నడుమ కల్యాణోత్సవాన్ని కనులపండువలా నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

పేదల స్థలాల దురాక్రమణ

గుత్తి: గుత్తిలో అధికార పార్టీ నాయకులు పేదల స్థలాలను దురాక్రమించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే 2007లో అప్పటి ప్రభుత్వం స్థానిక జంగాల కాలనీకి సమీపంలోని గుట్టపై సర్వే నంబర్లు 727–1,727–2లో 80 మంది పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో పాటు పట్టాలు కూడా ఇచ్చింది. ఇటీవల అధికార పార్టీ నాయకులు ఈ స్థలాలను ఆక్రమించేశారు.దీనిపై బాధితులు పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా, ఎలాంటి న్యాయం జరగలేదు. పైగా వారు అధికార పార్టీ నాయకులకే వంత పాడుతుండడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ పుణ్యవతిని వివరణ కోరగా ఆమె స్పందించారు. సర్వే నంబర్‌ 727–1,727–2 స్థలాలకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం లేదన్నారు. 2007లో పట్టాలు ఇచ్చారో లేదో కూడా తెలియదన్నారు.

గణేష్‌ మంటపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు

అనంతపురం సెంట్రల్‌: గణేష్‌ మంటపాలు ఏర్పాటు చేసుకునేందుకు www.ganesh utsav.net వెబ్‌సైట్‌ ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నట్ల్లు ఎస్పీ జగదీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో అనమతుల కోసం పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్‌, పంచాయతీ, విద్యుత్‌, రెవెన్యూశాఖల చుట్టూ తిరగాల్సి ఉండేదని, అన్ని శాఖలను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఎలాంటి రుసుం లేకుండానే అనుమతులు పొందవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోవాలని కోరారు.

ఐటీఐల్లో మిగులు సీట్లకు

కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఐటీఐలతో పాటు ప్రైవేటు ఐటీఐల్లో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం 5వ విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీని పొడిగించినట్లు జిల్లా ఐటీఐ కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ పి. రాయపరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. iti.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ దరఖాస్తుతో పాటు ఒరిజినల్‌ ధ్రువపత్రాలను ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు ప్రభుత్వ ఐటీఐ (బాలుర), అనంతపురంలో పరిశీలన చేయించుకోవాలి. కొత్త విద్యార్థులైతే ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు దరఖాస్తు చేసుకోవాలి. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రాయపరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement