అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంటల సాగు 65 శాతానికి చేరుకుంది. 3.43 లక్షల హెక్టార్లకు గానూ తాజా నివేదిక ప్రకారం 2.19 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ–క్రాప్ కొనసాగుతున్నందున సాగు విస్తీర్ణం మరింత పెరిగే పరిస్థితి ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇక.. ‘ప్రత్యామ్నాయం’కు సంబంధించి 30 శాతం విస్తీర్ణానికి విత్తనాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో మండల అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విత్తనం ఇచ్చామంటే ఈ–క్రాప్ చేయాల్సివుంటుందనే ఆలోచనతో చాలా పరిమితంగా ప్రత్యామ్నాయం చూపించే పరిస్థితి నెలకొంది. అలాగే వచ్చే నెల అక్టోబర్ నుంచి రబీ కూడా మొదలు కానుండటంతో నల్లరేగడి భూముల్లో ముందస్తుగా పప్పుశనగ సాగు చేసే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయానికి కొర్రీలు వేయనున్నట్లు చెబుతున్నారు. 31 వేల క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికలో చివరకు 5 వేల క్వింటాళ్లు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
● వ్యవసాయశాఖ తాజా నివేదిక ప్రకారం 2.19 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రాగా, అత్యధికంగా 1.08 లక్షల హెక్టార్లలో కంది సాగు చేశారు. ఆ తర్వాత వేరుశనగ 50 వేల హెక్టార్లుగా చూపించారు. 26,500 హెక్టార్లలో పత్తి, 14 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 10 వేల హెక్టార్లలో ఆముదం, 2,300 హెక్టార్లలో సజ్జ, కొర్ర 900 హెక్టార్లు, మిగతా పంటలు నామమాత్రంగా సాగు చేసినట్లు పేర్కొన్నారు. తేలికపాటి మినహా జూన్ 15 నుంచి వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నందున 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఖరీఫ్ దాదాపు దెబ్బతిని కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అక్టోబర్ నుంచి మొదలయ్యే రబీ ఆశలు కూడా వదులుకోవాల్సి ఉంటుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.


