అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్‌టీఏ నాయకులు కొనియాడారు. వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన అనేక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ స్కూల్స్ భావనతో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు ఆంగ్ల విద్య అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి విద్యారంగాన్ని బలోపేతం చేశారని పేర్కొన్నారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించారని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు.


