మద్యం మత్తులో డ్రైవింగ్‌.. యువకుడికి జైలు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో డ్రైవింగ్‌.. యువకుడికి జైలు

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

ఎన్‌పీకుంట: మండల కేంద్రానికి చెందిన ఇడగొట్టు ప్రశాంత్‌ అనే యువకుడు మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పట్టుబడ్డాడని ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలలో మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు గుర్తించామని, నిందితుడిని కదిరి జ్యుడీషియల్‌ సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా జడ్జీ 7 రోజులు జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.

ఆవు దాడిలో వృద్ధురాలి మృతి

వజ్రకరూరు: ఆవు దాడిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొనకొండ్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. కొనకొండ్ల ఇందిరమ్మ కాలనీకి చెందిన నెట్టికంటమ్మ (70) మంగళవారం ఇంటి వద్ద నుంచి సమీపంలోని దుకాణానికి వెళుతుండగా వెనుక వైపు నుంచి ఆవు దాడి చేసింది. దీంతో గాయపడిన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వృద్ధురాలు మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

● కాగా, అదే ఆవు దాడిలో మరో మహిళ గాయపడినట్లు తెలిసింది. ఇద్దరిపై దాడి చేసిన ఆవు కూడా మరణించడం గమనార్హం. ఈ ఆవు గ్రామంలోని ఓ దేవాలయానికి చెందినదిగా గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి వెల్లడించారు.

ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష

ఎన్‌పీకుంట: ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపర్చిన కేసులో ముద్దాయికి కదిరి అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాలమేరకు... మండల పరిధిలోని ఎగువతూపల్లికి చెందిన కుప్పాల గంగప్ప గత ఏడాది నవంబర్‌ 24న మల్లెం శ్రీరాములు అనే వ్యక్తి జేసీబీతో చేస్తున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తుండగా అతనితో గొడవపడి దాడి చేసి గాయపరిచాడన్నారు. బాధితుడి ఫిర్యాదుమేరకు అప్పటి ఎస్‌ఐ వలిబాషా కేసు నమోదు చేసి ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. కదిరి అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సాక్ష్యాలను పరిశీలించి ముద్దాయికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారన్నారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పుఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో సాక్ష్యులను హాజరుపరచి ముద్దాయికి శిక్షపడేలా చేసిన ఎస్‌ఐ కృష్ణమూర్తి, కోర్టు కానిస్టేబుల్‌ శేషగిరి, అధికారులు, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్‌ అభినందించనట్లు తెలియజేశారు.

నెట్టికంటమ్మ (ఫైల్‌)

మరణించిన ఆవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement