విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా కృషి చేయాలి

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డాక్టర్‌ ఎన్‌.అయూబ్‌ హుస్సేన్‌ సూచించారు. మంగళవారం నగరంలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల హాజరు, బోధన తదితర అంశాలను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలన్నారు. ప్రతి టీచరూ తమ సబ్జెక్టులో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని చెప్పారు. పదో తరగతి విద్యార్థులు ఎవ్వరూ గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు పూర్తయినందున విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలలో ‘మిషన్‌ మార్చ్‌’ కార్యక్రమం అమలుకు సంబంధించిన రోజువారీ కార్యకలాపాలను ప్రదర్శన బోర్డులో ఏర్పాటు చేయాలని సూచించారు. గత 30 రోజులుగా ఐదుగురు విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం లేదని ఆన్‌లైన్‌లో నమోదైన నేపథ్యంలో.. వారి ఇళ్లను సందర్శించి గైర్హాజరుకు కారణాలను తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు అందుబాటులో లేకుంటే నిబంధనల ప్రకారం డ్రాప్‌ బాక్స్‌లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులందరూ ‘ఐగాట్‌ కర్మయోగి’ కోర్సులను పూర్తి చేయాలని సూచించారు. బోధనలో అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులు అలవర్చుకుని విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించాలని డీఈఓ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement