డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): డి.హీరేహాళ్ మండలంలోని మురడి గ్రామశివారులో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు గ్రామ శివారులోని కొండ వైపు చిరుత వెళ్తుండడం గమనించారు. దీంతో భయాందోళనకు గురైన కూలీలు కేకలు వేయడంతో చిరుత పొలాల వైపు వెళ్లిపోయింది. వెంటనే గ్రామస్తులు డి.హీరేహాళ్ పోలీసులు, రాయదుర్గం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి అటవీశాఖ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత జాడకోసం అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో రైతులు, కూలీలు భయపడుతున్నారు. చిరుత సంచారంపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని అధికారులు గ్రామస్తులకు సూచించారు.
మహిళపై దాడి
తాడిపత్రి రూరల్: మండలంలోని వీరాపురం గ్రామంలో మంగళవారం హేమావతిపై రాము, రామిరెడ్డిలు దాడి చేశారని పోలీసులు తెలిపారు. మురికి నీరు ఇంటి వద్దకు వచ్చాయన్న ఆగ్రహంతో గంజి నీరు పోయడమే కాక తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు 100కు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వీరాపురం వెళ్లి ఇరువురిని విచారణ నిమిత్తం అప్‌గ్రెడ్ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు.


