పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య

Sep 1 2026 3:24 AM | Updated on Sep 1 2026 3:24 AM

యల్లనూరు: పుట్లూరు మండలం తక్కల్లపల్లికి చెందిన రామాంజనేయులు కుమార్తె చుక్కోళ్ల వాసవి (16) కొంతకాలం కడుపునొప్పితో బాధ పడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వాసవిని హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వాసవి చనిపోయినట్లు ఎస్‌ఐ సురేంద్రబాబు తెలిపారు. వాసవి తల్లి చిక్కోళ్ల అనంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ

గుత్తి: పట్టణంలోని కేపీఎస్‌ వెంచర్‌లో నివాసముండే విశ్రాంత రైల్వే ఉద్యోగి పురుషోత్తం ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు బీరువాలో దాచి ఉంచిన సుమారు తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వారం క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన పురుషోత్తం కుటుంబ సభ్యులు సోమవారం ఇంటికి వచ్చారు. తలుపులు తెరచి ఉండగా అనుమానం వచ్చి లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువాలో దాచి ఉంచి సుమారు తులం బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నేడు మహిళా క్రికెట్‌ జట్ల ఎంపిక

అనంతపురం: ఆర్డీటీ క్రికెట్‌ టాలెంట్‌ హంట్‌లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్‌–15, అండర్‌–18 విభాగాల్లో మహిళా కికెట్‌ జట్లను ఎంపిక చేయనున్నారు. కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బాలికలతో పాటు స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న మహిళా క్రికెటర్లు ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చన్నారు. ఈ మేరకు ఆర్డీటీ క్రీడా విభాగం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

కె.ఊబిచెర్లలో చోరీ

గుత్తి రూరల్‌: మండలంలోని కె.ఊబిచెర్లలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సోమవారం బాధితులు తెలిపిన మేరకు ... గ్రామానికి చెందిన నాయకం గోవిందు, రామేశ్వరమ్మ దంపతులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 29న హైదరాబాద్‌ వెళ్లారు. అయితే ఈ నెల 3, 4 తేదీల్లో గోవిందు సోదరుడి వివాహం ఉండటంతో హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వచ్చారు. ఇంటి గేటు తాళాలు తీసి ఇంట్లోకి వెళ్లగా ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. రెండు బీరువాల్లో ఉంచిన 10 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు తెలుసుకొని వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంలను రప్పించి ఆధారాలను సేకరించారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

యల్లనూరు: చిలమకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చిన్న బింగన్నగారి భాస్కర్‌తో పాటు మరొకరిపై జేసీ అనుచరులు సోమవారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. వివరాలు.. భాస్కర్‌తో పాటు గడ్డంవారిపల్లి పరమేష్‌, తిరుమలాపురం శ్రీను కలిసి బైక్‌పై చిలమకూరు పెద్దమ్మగుడి వద్ద వస్తున్నారు. అదే సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చిలమకూరు గ్రామానికి వస్తున్నారు. ఈ సందర్భంగా జేసీ సమక్షంలోనే ఆయన అనుచరులు భాస్కర్‌, శ్రీనుపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

50 తులాల బంగారు నగల చోరీ

రాయదుర్గంటౌన్‌: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళను మాటలతో ఏమార్చి బ్యాగులోని 50 తులాల బంగారు నగలను అపహరించారు. ఈమేరకు డీ.హీరేహాళ్‌ మండలం మడేనహళ్లికి చెందిన పుష్పలత రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం పుష్పలత కణేకల్లులోని తన పుట్టింటికి వెళ్లి తిరిగి రాయదుర్గానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. కణేకల్లు క్రాస్‌లో ఓ మహిళ బస్సు ఎక్కి పుష్పలత పక్కన కూర్చుంది. స్నేహంగా మాటలు కలిపి పిల్లవాడికి పాలు తాగించేందుకు అంటూ కింద కూర్చొని బ్యాగులో ఉంచిన 50 తులాల బంగారు నగలను దొంగిలించింది. రాయదుర్గం పట్టణానికి చేరుకోగా మొదటి స్టాప్‌లో సదరు మహిళ దిగిపోయింది. బస్సు బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత బ్యాగ్‌ జిప్‌ తీసి ఉండటంతో దొంగతనం విషయం బయట పడింది. దీంతో పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement