ముగిసిన అహుడా కథ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన అహుడా కథ

Sep 1 2026 3:24 AM | Updated on Sep 1 2026 3:24 AM

అనంతపురం క్రైం: ఉమ్మడి అనంతపురం జిల్లా విభజనకు అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. ఇప్పటి వరకూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిని కలుపుతూ ఉన్న అనంతపురం – హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ (అహుడా) ఇకపై ఉండదు. దాని స్థానంలో రెండు జిల్లాలకు రెండు ప్రత్యేక పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఈ నెల 17న రెండు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురానికి ఏటీపీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (యూడీఏ), అహుడా పరిధిలోని శ్రీసత్యసాయి జిల్లా ప్రాంతాలను తొలగిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నంబర్‌ 197 జారీ చేసింది. దీంతో అనంతపురం జిల్లా ప్రాంతంతో అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ (ఏటీపీ యూడీఏ) ఏర్పడింది. ఈ పరిధిలో అనంతపురం నగరపాలక సంస్థతో పాటు రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అదే విధంగా 31 పూర్తి మండలాలు, 507 రెవెన్యూ గ్రామాలు ఏటీపీ యూడీఏ పరిధిలోకి వచ్చాయి. మొత్తం విస్తీర్ణం సుమారు 10,205 చదరపు కిలోమీటర్లుగా ఉంది.

శ్రీసత్యసాయికి ‘పుడా’

శ్రీసత్యసాయి జిల్లా ప్రాంతాలను ఒకే పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్‌ నంబర్‌ 190 జారీ చేసింది. పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పీయూడీఏ) పరిధిలో శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండలాలు, గ్రామాలను చేర్చారు. కొత్త పుడా పరిధిలో 31 మండలాలు, 461 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం సుమారు 8,925 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి తదితర ప్రాంతాలు ఇకపై పుడా పరిధిలో పట్టణాభివృద్ధి ప్రణాళికలకు లోబడి ఉంటాయి.

అహుడాకు తెర

జిల్లాల విభజన జరిగినప్పటికీ ఇప్పటివరకూ కొనసాగుతున్న అహుడా వ్యవస్థను ప్రభుత్వం తాజాగా పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. దీంతో అహుడా పేరు చరిత్రలో కలిసిపోయి.. అనంతపురం జిల్లాకు ఏటీపీ యూడీఏ, శ్రీసత్యసాయి జిల్లాకు పుడా అధికారికంగా రూపుదిద్దుకున్నాయి. ఇకపై ఆయా ప్రాంతాల్లో మాస్టర్‌ప్లాన్లు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు, అభివృద్ధి ప్రణాళికలు, పట్టణ విస్తరణ వంటి అంశాలను ఆయా యూడీఏలు పర్యవేక్షించనున్నాయి.

చైర్మన్ల నియామకం ఎప్పుడో?

కొత్తగా రెండు యూడీఏల పరిధులు ఖరారైనప్పటికీ వాటి చైర్మన్ల నియామకం మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో కొత్త యూడీఏలకు చైర్మన్లుగా ఎవరిని నియమిస్తారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం తదుపరి దశలో చైర్మన్ల నియామకంతో పాటు ఇతర పాలక వ్యవస్థను పూర్తి చేయాల్సి ఉంది.

కొత్తగా అనంతకు ఏటీపీ యూడీఏ,

శ్రీసత్యసాయికి పుడా

ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన

రాష్ట్ర ప్రభుత్వం

చైర్మన్ల నియామకమే తరువాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement