అనంతపురం క్రైం: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందాల్సిన సేవలకు ఆటంకం కలగకుండా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సిబ్బందిని ఇతర ప్రభుత్వ విధులకు దూరంగా ఉంచాలని జిల్లా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు అధికారి జి.నాసరరెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులను బీఎల్‌ఓ విధులు, జనగణన, ఇతర సర్వే సంబంధిత పనులకు వినియోగించకూడదని స్పష్టం చేశారు.
మహిళల ఖోఖో జట్టుకు ద్వితీయస్థానం
అనంతపురం: ఆగస్టు 24 నుంచి 29 వరకు తిరుపతిలో నిర్వహించిన అమరావతి చాంపియన్‌షిప్–2026లో అనంతపురం జిల్లా మహిళల ఖోఖో జట్టు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని సాధించింది. జట్టు సభ్యుల్లో ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఉన్నారు. వీరిలో సివిల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థినులు శ్రీజ, అర్చన, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) మూడో సంవత్సరం విద్యార్థిని శారద ఉన్నారు. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.జ్యోతికుమార్ క్రీడాకారిణులను సోమవారం అభినందించారు.
సమ్మెలోకి ‘సత్యసాయి’ తాగునీటి కార్మికులు
అనంతపురం అర్బన్/కూడేరు: సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు కార్మికులకు మళ్లీ నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ఇందులో భాగంగానే వేతనాలు చెల్లించాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రాజెక్టు కార్మికులు చేపట్టిన రిలే దీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌వీనాయుడు, నాగేంద్రకుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఐదు నెలలుగా కార్మికులకు వేతనం ఇవ్వకపోతే వారు కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఈనెల 10న కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందించామన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నామన్నారు. మరోవైపు కూడేరు పరిధిలో పీఏబీఆర్ డ్యాం వద్ద ఏర్పాటైన సత్యసాయి ప్రాజెక్ట్‌లో మోటర్లు పని చేయకుండా కార్మికులు స్విచ్ ఆఫ్ చేశారు.


