బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విద్యుత్ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అధికారులు సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు. టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. అర్హులైన రైతులు డీడీలు తీసి ట్రాన్స్‌ఫార్మర్లు, కనెక్షన్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీ అనుయాయులైతే ఆగమేఘాలపై విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. అర్హులకు అందాల్సిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, పరికరాలు టీడీపీ వర్గీయులకు కట్టబెడుతుండపై రైతులు మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 1,719 మంది రైతులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం నిరీక్షిస్తున్నారు. సామాన్య రైతులు తమ పొలాలకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. విద్యుత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనెక్షన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. విద్యుత్ సదుపాయం లేక పంటలు ఎండిపోయి రూ.లక్షలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
టీడీపీ నేతలకు
విద్యుత్ అధికారుల వత్తాసు..
ఒక వైపు సామాన్య రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం అల్లాడుతుంటే మరోవైపు అధికార టీడీపీ నేతలకు మాత్రం అధికారులు ఆగమేఘాలపై కనెక్షన్లు మంజూరు చేస్తుండటం గమనార్హం. నిబంధనలు పక్కనపెట్టి దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే నేతల పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తుండంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో అధికారుల తీరుపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు రైతులు వాపోతున్నారు.
బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ఓ రైతు 2024 అక్టోబర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ కోసం డీడీ చెల్లించాడు. రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ట్రాన్స్‌ఫార్మర్, పరికరాలు ఇవ్వలేదు. కానీ అదే నెలలోనే ట్రాన్స్‌ఫార్మర్, పరికరాలు అన్నీ ఇచ్చినట్లుగా విద్యుత్ అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. తనకు పరికరాలు కావాలని సదరు రైతు విద్యుత్ అధికారులను అడిగితే రెండేళ్లుగా ఇస్తామంటూనే కాలయాపన చేస్తున్నారని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు.
ట్రాన్స్‌ఫార్మర్ల కోసం
ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న రైతులు
టీడీపీ నేతలకు
విద్యుత్ అధికారుల వత్తాసు
అధికార పార్టీ మద్దతుదారులైతే
ఆగమేఘాలపై కనెక్షన్లు
సీనియార్టీ మేరకే ట్రాన్స్‌ఫార్మర్లు
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సీనియార్టీ ప్రకారమే అందిస్తాం. డీడీలు కట్టకుండానే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిస్తే.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకువస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమస్య పరిష్కరిస్తాం.
– కళ్యాణ్ చక్రవర్తి, ఈఈ, కళ్యాణదుర్గం
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలోనిది. టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు ట్రాన్స్‌ఫార్మర్ కనెక్షన్ కోసం డీడీ తీయలేదు. అయినా 8 నెలల క్రితమే ట్రాన్స్‌ఫార్మరు ఏర్పాటు చేశారు. అసలైన రైతులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. టీడీపీ నేత డీడీ చెల్లించుకుండానే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేయడంపై రైతులు మండిపడుతున్నారు.


