పెరుగు ప్యాకెట్‌కు వచ్చి నగదు అపహరణ | - | Sakshi
Sakshi News home page

పెరుగు ప్యాకెట్‌కు వచ్చి నగదు అపహరణ

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

పెనుకొండ రూరల్‌ (సోమందేపల్లి): పెరుగు ప్యాకెట్‌ కోసం వచ్చిన వ్యక్తులు దుకాణంలో నగదు అపహరించారు. ఈ ఘటన సోమందేపల్లిలోని ఇండియన్‌ పెట్రోల్‌ బంకు సమీపంలోని మదర్‌ డెయిరీలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మదర్‌ డెయిరీ యజమాని చరణ్‌ దుకాణంలో చిన్న పిల్లలను ఉంచి పనిపై బయటకు వెళ్లాడు. దీన్ని గమనించిన బుల్లెట్‌ ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు వంద రూపాయల నోటు ఇచ్చి పెరుగు ప్యాకెట్‌ ఇవ్వాలని చిన్నారులను కోరారు. పెరుగు ప్యాకెట్‌ ఇచ్చిన తర్వాత గల్లా పెట్టెలోని చిల్లరను చిన్నారులు తీసి ఇచ్చే క్రమంలో వారిని ఏమార్చి అందులోని పదివేల రూపాయల నగదును అపహరించారు. దుకాణానికి తిరిగి వచ్చిన తర్వాత యజమాని గమనించి చిన్నారులను ఆరా తీశాడు. ఇద్దరు వ్యక్తులు వచ్చి ‘ఆ నోటు బాగలేదు..ఈ నోటు బాగలేదు’ అంటూ తమను ఏమార్చిన విషయాన్ని తెలిపారు. వారే నగదు అపహరించి ఉంటారని నిర్ధారణకు వచ్చి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

వ్యక్తి ఆత్మహత్య

పామిడి: పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన భాస్కర్‌ (33) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. భాస్కర్‌ గతంలో నైటీల కటింగ్‌ వర్క్‌ చేస్తూ భార్య, కుమారున్ని పోషించేవాడు. అయితే..కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. విసిగి వేసారిన భార్య వినీత రెండేళ్ల క్రితం తన తొమ్మిదేళ్ల కుమారుడు బాబును తీసుకుని పుట్టినిల్లు అయిన పెద్దవడుగూరు మండలం ముప్పాలగుత్తికి చేరుకుంది. దీంతో ఒంటరైన భాస్కర్‌ జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి పామిడి పోలీసుస్టేషన్‌కు సమీపంలోని గదిలో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది ధ్రువీకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో

లారీడ్రైవర్‌ మృతి

కదిరి అర్బన్‌: మండల పరిధిలోని యర్రదొడ్డి టోల్‌గేట్‌ సమీపంలో కదిరి– అనంతపురం ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్‌ గణేశన్‌ (63) మృతిచెందాడు. కదిరి రూరల్‌ అప్‌గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన మేరకు...టోల్‌గేట్‌ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అనంతపురం వైపు నుంచి తమిళనాడుకు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన లారీడ్రైవర్‌ గణేశన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

రైలు నుంచి జారిపడి

యువకుడి మృతి

కనగానపల్లి: చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి సమీపంలో ఆదివారం ఒక యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. హిందూపురం రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ లావణ్య తెలిపిన వివరాల మేరకు... ధర్మవరం రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత ప్యాదిండి వద్ద రైల్వే ట్రాక్‌ పక్కన ఒక యువకుడి మృతదేహం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం పట్టణం ఇందిరానగర్‌కు చెందిన హర్షవర్ధన్‌ (21)గా గుర్తించారు. మగ్గం పనులు నేర్చుకుంటున్న ఈ యువకుడు శనివారం సాయంత్రం బయటకు వెళ్తున్నానని తల్లి కాంతమ్మకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. తర్వాత ధర్మవరం నుంచి రైలులో ఎక్కడికో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి ఉండొచ్చునని మృతుడి బంధువులు తెలిపారు. హిందూపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపడుతున్నారు.

కర్ణాటక వాసి దుర్మరణం

హిందూపురం టౌన్‌: హిందూపురం రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నారాయణపురం–పెనుకొండ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఇతను కర్ణాటక రాష్ట్రం హవేరి తాలుకా బసాపూర్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ చావడిగా గుర్తించారు. హిందూపురం రైల్వే ఎస్‌ఐ లావణ్య తెలిపిన మేరకు.. రైల్వే కి.మీ 11/000–11/100 వద్ద రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని శనివారం ఆన్‌ డ్యూటీ కీమ్యాన్‌ తిరుపాల్‌ నాయక్‌ గుర్తించారు. హిందూపురం రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ ద్వారా రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 25–30 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తి రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని తలకు తీవ్ర గాయం కావడంతో పాటు శరీరంపై పలు గాయాలు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయగా మృతుడు కర్ణాటకవాసిగా తేలింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement