నేటి నుంచి ఆర్డీటీ క్రికెట్‌ టాలెంట్‌ హంట్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆర్డీటీ క్రికెట్‌ టాలెంట్‌ హంట్‌

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

అనంతపురం: ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రికెట్‌ క్రీడాకారులను వెలికితీసి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఆర్డీటీ చర్యలు చేపట్టింది. ‘క్రికెట్‌ టాలెంట్‌ హంట్‌’ పేరుతో సోమవారం నుంచి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు అనంత క్రీడాగ్రామంలోని క్రికెట్‌ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అండర్‌–15, అండర్‌–18 విభాగాల్లో సెలక్షన్స్‌ జరుగుతాయి. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే బాలబాలికలు ఇప్పటి వరకూ ఏ విభాగంలోనూ జిల్లా స్థాయికి మించి ఆడి ఉండకూడదు. ఎంపిక జరిగే ప్రాంతంలోనే నమోదు ప్రక్రియ ఉంటుంది. ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకెళ్లాలి. ఈ నెల 31న హిందూపురంలోని ఎంజీఎం స్కూల్‌ మైదానం, సెప్టెంబర్‌ 1న కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, 2న గుంతకల్లు రైల్వే గ్రౌండ్‌, 3న కళ్యాణదుర్గం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం, 4న ధర్మవరంలోని ఆర్డీటీ క్రీడా కేంద్రం, 5న అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా కేంద్రంలో ఎంపికలు ఉంటాయి.

అనంత, చిత్తూరు మ్యాచ్‌ డ్రా

అనంతపురం: అనంత క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–23 మల్టీడే క్రికెట్‌ టోర్నీలో భాగంగా అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చిత్తూరు జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆదివారం ఆట కొనసాగించింది. 130.4 ఓవర్లలో 531 పరుగులకు ఆలౌట్‌ అయింది. చిత్తూరు బ్యాటర్‌ కృష్ణతేజారెడ్డి సెంచరీ (132)తో కదంతొక్కాడు. చరంజిత్‌ (84), రుషిల్‌ (82), భవానీ ప్రసాద్‌ (73), సాయిచరణ్‌ (45) రాణించారు. అనంతపురం బౌలర్లలో ప్రదీప్‌రెడ్డి, అర్జున్‌ టెండూల్కర్‌ చెరో మూడు వికెట్లు, ప్రమోద్‌కుమార్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అనంతపురం జట్టు చివరి రోజు ఆట ముగిసే సమయానికి 36.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 254 పరుగులు సాధించింది. అర్జున్‌ టెండూల్కర్‌ 65 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్‌ వీరారెడ్డి 64, జయంత్‌ కృష్ణ 54 పరుగులు సాధించారు.

సీఐ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ

అనంతపురం సెంట్రల్‌: కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సీఐ తబ్రేజ్‌ అహ్మద్‌ కారు తరచూ ప్రమాదానికి గురవుతోంది. వారం రోజుల క్రితం అనంతపురం తపోవనం సర్కిల్‌లో సీఐ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటన మరువక ముందే ఆదివారం స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలో ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద రెడీ టూ కాంక్రీట్‌ మిక్చర్‌ లారీ ఢీ కొట్టింది. కారు స్వల్పంగా దెబ్బతింది. ఘటనపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement