అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాకు గతేడాది 52 టీఎంసీల నీటిని తెచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు, అధికారులు.. ఈసారి పరిస్థితిని ముందే ఎందుకు అంచనా వేయలేకపోయారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. ఎల్–నినో ప్రభావం ఉంటుందని, భవిష్యత్తులో వర్షాలు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నప్పటికీ గతేడాది నీటిని సద్వినియోగం చేసుకోలేదన్నారు. రానున్న రోజుల్లో అనంతపురం జిల్లా ఎడారిగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాలువ గట్లపై పోలీసు పహారా కాస్తున్నారని, రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లు, పైపులైన్లు తొలగిస్తున్నారని, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుప్పం ప్రాంతంలోని చెరువులన్నీ నిండే వరకు అనంతపురం జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందించే పరిస్థితి లేదన్నారు.
కాంక్రీట్ లైనింగ్ పేరుతో దోపిడీ
హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ పేరుతో రూ.4 వేల కోట్ల దోపిడీ జరిగిందని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. లైనింగ్ పూర్తయినా చిత్తూరు జిల్లాలో 50 శాతం నీరు లాస్ కింద పోతోందన్నారు. ‘కాలువకు కాంక్రీట్ వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. లైనింగ్ వేయడం మానవ తప్పిదం’ అని అన్నారు. టీడీపీ అంటే దోపిడీ, దౌర్జన్యాల పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
పేరూరు డ్యాంకు నీళ్లెందుకు ఇవ్వలేదు?
పేరూరు బ్రాంచ్ కెనాల్‌కు ఒక టీఎంసీ నీళ్లు ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2020లోనే జీఓ ఇచ్చారని, ఆయన హయాంలో మూడేళ్లు పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు చుక్కనీరు లేక చుట్టుపక్కల వేలాది బోర్లు ఎండిపోతున్నాయన్నారు. ‘వెయ్యి అడుగుల మేర తవ్వినా నీళ్లు పడలేదని స్వయంగా ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో చెప్పారన్నారు. ‘రెండేళ్లు చుక్క నీరు ఇవ్వకుండా పేరూరు డ్యాంకును ఎండబెట్టింది మీరు కదా? ఆ పాపం మీది కాదా?’ అంటూ పరిటాల సునీతను ప్రశ్నించారు. జీడిపల్లి–అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును 2028లో పూర్తి చేస్తామని చెబుతున్నారని, అప్పటివరకు ప్రజలు తాగునీటికి ఏం చేయాలని నిలదీశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల రానున్న ఆరు నెలల్లో జిల్లాలో 50 శాతం మంది ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే జిల్లా ఎడారిగా మారుతుందని ప్రకాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాప్తాడులో మళ్లీ పాత సంస్కృతి
రాప్తాడు నియోజకవర్గంలో మళ్లీ పాత సంస్కృతిని తెరపైకి తెస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. పేరూరు డ్యాంకు నీళ్లు విడుదల చేయకపోతే ఆరు మండలాల ప్రజలు ఎమ్మెల్యే సునీత ఇంటిముందు ధర్నా చేస్తారన్నారు. పీఏబీఆర్ నుంచి పాపంపేట వరకు తాగునీటి పనులు పూర్తి చేయకపోతే ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాల ప్రజలు మీ ఇంటివద్ద ధర్నా చేస్తారన్నారు. అలాగే జీడిపల్లి–అప్పర్‌పెన్నార్ ప్రాజెక్ట్‌కు సంబంధించి రైతులకు భూ సేకరణ బకాయిలు విడుదల చేయకపోతే బాధితులు మీ ఇంటిముందు ఆందోళన చేపడతారని హెచ్చరించారు. మొదటి హెచ్చరికగా సంబంధిత ఎస్‌ఈ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తారని, అప్పటికీ స్పందించకపోతే ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలు చేస్తారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, మారుతీప్రసాద్, నాగార్జున, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, నాయకులు బద్దలాపురం పెద్దిరెడ్డి, మీనుగ నాగరాజు, పాపంపేట ప్రసాద్‌రెడ్డి, భానుకోట శివ, నెమలివరం శీనా, సుధాకర్, ప్రణీల్‌రెడ్డి పాల్గొన్నారు.
గతేడాది 52 టీఎంసీలు ఇచ్చామన్నారు.. ఈసారి చుక్క నీరివ్వలేరా?
ఆరు నెలల్లో 50 శాతం మంది ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి
పేరూరు డ్యాంకు నీళ్లివ్వకపోతే ఎమ్మెల్యే ఇంటి ముందు ప్రజల ధర్నా
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


