అనంతపురం: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైఎస్సార్‌సీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రేటర్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అధ్యక్షతన జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. పార్టీ పీఏసీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, జిల్లా టాస్క్ ఫోర్స్ కో ఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి, ఐటీ విభాగం జోనల్ కోఆర్డినేటర్ మంజునాథ్ యాదవ్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర జలాలను తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. తాగునీటితో పాటు సాగునీరు, పశువులకు అవసరమైన నీరు అందించడం కూడా ప్రభుత్వ బాధ్యతే అని స్పష్టం చేశారు. తాగునీటికే పరిమితం చేస్తే ఇప్పటికే వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమకు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కృష్ణా–తుంగభద్ర జలాల్లో రావాల్సిన న్యాయమైన వాటా, నీటి విడుదల, అవసరమైన సాగునీటి కేటాయింపులు కచ్చితంగా దక్కేలా ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒత్తిడి తీసుకురావడంపై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు రాయలసీమ సాగునీటి హక్కుల కోసం శాసీ్త్రయ ఆధారాలతో, వాస్తవ గణాంకాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
సాగునీటి సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి
ప్రజలకూ అవగాహన కల్పించాలి
వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో నిర్ణయం


