అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ సూచించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్‌జీఎఫ్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు పాఠశాలలకు క్రీడా ప్రతిభ అవార్డులు అందించారు. శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. డీఈఓ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకొని క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చదువుతోపాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డీవైఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలల్లో కొందరు విద్యార్థులను మాత్రమే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపే విధానం కాకుండా ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గుత్తి డీవైఈఓ లక్ష్మన్న, ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, ఏపీఎస్‌ఏపీఈ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి, పీడీ, పీఈటీ జిల్లా కార్యదర్శి సిరాజుద్దీన్, ఐదు పాఠశాలల హెచ్‌ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


