బెళుగుప్ప: మండలంలోని గంగవరంలో భార్యపై అనుమానంతో మారణాయుధాలతో పైశాచికంగా దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన భానుకు కణేకల్లుకు చెందిన యాశిన్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఖాజీమ్, ముజీమ్ అనే ఇద్దరు కుమారులు సంతానం. యాశిన్ బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగించే వాడు. భార్యపై అనుమానంతో చిత్రహింసలు పెట్టడంతో పోలీసులు, బంధువులు పంచాయితీలు చేశారు. ఇదే క్రమంలో కణేకల్లు నుంచి గంగవరం వచ్చి ఇంటిని అద్దెకు తీసుకొని జీవనం సాగించేవారు. అయినా కూడా మట్కా, జూదం వ్యసనాలకు లోనైన యాసిన్ పద్ధతి మార్చుకోక పోగా భార్యపై అనుమానం మరింత పెంచుకున్నాడు. శనివారం తెల్లవారుజామున మారణాయుధంతో మెడ చుట్టూ పొడిచి, రోకలిబండతో ముఖాన్ని ఛిద్రం చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె కుప్పకూలి పడిపోవడంతో నిందితుడు పారిపోయాడు. స్థానికులు గ్రహించి తొలుత కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్సకు అనంతపురం తరలించారు. ఘటనపై బాధిత మహిళ భాను సోదరుడు మస్తాన్‌వలీ ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


