నార్పల: మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో బస్సులో బంగారం చోరీకి గురైన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. మడుగుపల్లికి చెందిన నందిని అనంతపురం వెళ్లేందుకు నార్పల బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తోంది. బస్సు రాగానే బాగా రద్దీగా ఉండడంతో బస్సులో సీటుకోసం తోటి ప్రయాణికులకు సీటుపై వేయమని చెప్పి తన బ్యాగ్‌ను అప్పగించింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికి బ్యాగ్‌ను పరిశీలించగా సుమరుగా నాలుగు తులాలు బంగారు కనిపించలేదు. దీంతో నందిని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే నార్పల పోలీసుస్టేషన్ ఎదుట బస్సును ఆపి ప్రయాణికులను తనిఖీ చేశారు. అయితే తనిఖీలో బంగారం ఆచూకీ మాత్రం లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ఆలయాల్లో
ఆభరణాల చోరీ
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో ఆలయాల్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి సమయలో రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులోని జుంజప్ప ఆలయంలో తాళం ధ్వంసం చేసి స్వామి వారికి కానుకల రూపంలో వచ్చిన దాదాపుగా 4 కేజీల వెండి ఆభరణాలను దొచుకెళ్లారు. అలాగే మండల పరిధిలోని బోయలపల్లిలో ముత్యాలమ్మ ఆలయంలో కానుక రూపంలో వచ్చిన రెండు బంగారు తాళిబొట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. పట్టణ, రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


