వినియోగదారులకు ‘ఆన్‌లైన్‌’ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు ‘ఆన్‌లైన్‌’ షాక్‌

Aug 22 2026 12:18 AM | Updated on Aug 22 2026 12:18 AM

రాప్తాడు రూరల్‌: విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని తప్పనిసరి చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ లేక.. ఆన్‌లైన్‌ చెల్లింపులపై అవగాహన లేక.. చిన్న మొబైల్‌ ఫోన్లు మాత్రమే ఉన్న వారు బిల్లులు ఎలా చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బందిని నిలదీస్తున్నారు. శుక్రవారం కందుకూరు గ్రామంలో విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వచ్చిన సిబ్బందిని గ్రామస్తులు ప్రశ్నించారు.

చిన్న ఫోన్లతో ఎలా కట్టాలి?

తమ వద్ద ఫోన్‌పే సదుపాయం లేదని, కొందరి వద్ద స్మార్ట్‌ఫోన్లే లేవని గ్రామస్తులు తెలిపారు. నగదు ఇస్తామని చెప్పినా బిల్లు తీసుకోకుండా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని సిబ్బంది సూచించడంతో అసహనం వ్యక్తం చేశారు. ‘‘మాకు ఆన్‌లైన్‌ సదుపాయం లేదు.. నగదు తీసుకుని బిల్లు కట్టించుకోండి’’ అంటూ సిబ్బందిని కోరారు. ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించే సదుపాయం లేని వారు మీ సేవ కేంద్రాలను ఆశ్రయించాలని సిబ్బంది సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే అక్కడ బిల్లు చెల్లించేందుకు అదనంగా సేవా రుసుము చెల్లించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఒకవైపు బిల్లు భారం.. మరోవైపు సేవా రుసుముతో తమపై అదనపు భారం పడుతోందన్నారు.

గడువు దాటితే జరిమానా..

బిల్లు గడువు దాటితే జరిమానా పడుతుందని, అందుకే గడువులోగానే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు చెప్పారు. అయితే ఆన్‌లైన్‌ విధానం పేరుతో నగదు తీసుకోకపోవడంతో తాము ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. ఒకరోజు ఆలస్యమైనా జరిమానా విధించే అధికారులు.. గడువులోగా బిల్లు చెల్లించేందుకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. విద్యుత్‌ బిల్లుల్లో స్థిర చార్జీలు, వినియోగ చార్జీలు, సర్‌చార్జీలు తదితరాల పేరుతో ఇప్పటికే భారం పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు, వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపులోనూ ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించడంలో తప్పులేదని, అయితే స్మార్ట్‌ఫోన్లు లేని వినియోగదారులకు ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామాలకు వచ్చే విద్యుత్‌ సిబ్బంది నగదు రూపంలోనూ బిల్లులు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే ఆన్‌లైన్‌ చెల్లింపులు తెలియని పేద, గ్రామీణ వినియోగదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగదు తీసుకోకుండా.. ఆన్‌లైన్‌లోనే బిల్లు చెల్లించాలంటున్న సిబ్బంది

విద్యుత్‌శాఖ తీరుపై వినియోగదారుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement