రాప్తాడు రూరల్: నమ్మకంగా ఉంటూ ఇంటి విషయాలు తెలుసుకున్న ఓ డ్రైవర్ చివరకు అదే ఇంటికి కన్నం వేశాడు. మరో ఇద్దరితో కలిసి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. చెడు అలవాట్లకు బానిసైన ముగ్గురు నిందితులను ఇటుకలపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కేసు వివరాలను ఎస్‌ఐ విజయ్‌కుమార్‌తో కలిసి సీఐ హేమంత్‌కుమార్ వెల్లడించారు. ఆకుతోటపల్లి గ్రామ శివారులో నివాసముంటున్న ఆర్‌అండ్‌బీ ఏఈ సాకే జయధనలక్ష్మీదేవి ఇంట్లో జూలై 17న సుమారు 15.6 తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూరల్ ఇన్‌చార్జ్ డీఎస్పీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో సీఐ హేమంత్‌కుమార్, ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. పక్కా సమాచారం మేరకు ఆకుతోటపల్లి సమీపంలోని వివేకానంద బాలికల జూనియర్ కళాశాల వెనుక ఉన్న కల్వర్టు వద్ద ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకుతోటపల్లికి చెందిన బొగ్గు మధు, ఇటుకలపల్లికి చెందిన బొమ్మల మధుకిషోర్, మందల పవన్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బంగారంలో 9.18 తులాల ఆభరణాలను ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్ సంస్థల్లో కుదువ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టారు.
నమ్మకాన్ని వమ్ము చేసిన డ్రైవర్
ఈ కేసులో ప్రధాన నిందితుడైన బొగ్గు మధు బాధితురాలి వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆమె కుటుంబం వద్ద నమ్మకంగా ఉంటూ ఇంటి నిర్మాణ పనుల్లోనూ సహకరించేవాడు. అయితే తక్కువ జీతంతో తన జల్సాలకు సరిపడా డబ్బు లేకపోవడంతో చెడు అలవాట్లకు బానిసైన మధు దొంగతనానికి పథకం వేశాడు. యజమాని ఊరిలో లేని విషయం తెలుసుకొని మధు.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని ఫైనాన్స్ సంస్థల్లో కుదువ పెట్టి వచ్చిన డబ్బును తమ అవసరాలకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది.
స్నేహితులతో కలిసి యజమాని ఇంట్లో బంగారం, నగదు అపహరించిన డ్రైవర్
ముగ్గురు నిందితుల అరెస్టు


