అనంతపురం సెంట్రల్: చెడు వ్యసనాలకు బానిసైన ఇద్దరు మిత్రులు జల్సాలను తీర్చుకోవడానికి దొంగల అవతారమెత్తారు. జిల్లాలోనే కాకుండా తెలంగాణలో సైతం తస్కరించిన ద్విచక్రవాహనాలను ఒక చోట భద్రపరిచి బెంగుళూరులో విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల వివరాలను శనివారం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ మహబూబ్‌బాషా వెల్లడించారు. రూరల్ మండల పరిధిలోని నందమూరి నగర్‌కు చెందిన బండారు మురళీకృష్ణ, ఆర్‌కే నగర్‌కు చెందిన వన్నూరు షేక్ అలీ అక్బర్‌లు స్నేహితులు. తాగుడుకు బానిసైన వీరు డబ్బు కోసం ఇళ్లు, హాస్పిటళ్లు తదితర చోట్ల పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరించేవారు. కొన్ని నెలలుగా నగరంలో ద్విచక్రవాహనాల దొంగతనాలు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం ప్రసన్నాయపల్లి రైల్వే గేటు సమీపంలో టూటౌన్ సీఐ పుల్లయ్య, ఎస్‌ఐలు రుషేంద్రబాబు, రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఒక ద్విచక్రవాహనంలో నిందితులు అనుమానాస్పదంగా వచ్చారు. వారిని పట్టుకొని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. అనంతపురం, తాడిపత్రి, పెనుకొండ, కదిరి, గుంతకల్లు పట్టణాలతో పాటు తెలంగాణలోనూ ద్విచక్రవాహనాలు దొంగలించి నగరంలో వివిధ చోట్ల భద్రపరిచినట్లు పేర్కొన్నారు. మొత్తం రూ.19 లక్షల విలువజేసే 25 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ మహబూబ్‌బాషా వివరించారు.
భక్తిశ్రద్ధలతో గంధం ఉత్సవం
గుంతకల్లు: పాత గుంతకల్లులోని హజరత్ మస్తాన్‌వలి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా శనివారం గంధం ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు దర్గా ధర్మకర్తలు, వక్ఫ్‌బోర్డు అధికారులు, ముజావర్ల నేతృత్వంలో గంధం ఉత్సవం వైభవంగా జరిగింది. అందంగా అలంకరించిన గంధం పళ్లేన్ని గుర్రంపై ఉంచి మేళతాళాల నడుమ దర్గా నుంచి ఊరుయకాల సమీపంలోని గణాచారి రెడ్డి కులస్తుల ఇంటికి చేర్చారు. సాజెదినాసేన్ (పూజారులు) ప్రత్యేక ప్రార్థనల అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా దర్గాకు తీసుకొచ్చారు. మస్తానయ్య ప్రార్థనా మందిరం చుట్టూ ప్రదక్షిణ చేశారు.


