గుత్తి: గుత్తి కోట ఉత్సవాల్లో భాగంగా ఎంఎస్ ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఆదివారం రాయలసీమ నాణేల సేకరణ సంఘం ఆధ్వర్యంలో పురాతన నాణేల ప్రదర్శన శాల ప్రారంభమైంది. ఈ ప్రదర్శన శాలను గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్, ప్రముఖ సినిమా యాక్టర్ గుత్తి మధు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురాతన నాణేల సేకరణ కర్తలు విష్ణు భగవాన్, నాగరాజారావులను అభినందించారు. క్రీ.శ.1వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు వివిధ రాజుల కాలం నాటి నాణేలను ప్రదర్శించారు. నాణేల ప్రదర్శన శాలను వందలాది మంది సందర్శించారు.
లారీ కింద పడి
చత్తీస్‌ఘడ్ వాసి మృతి
కుందుర్పి: చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన సంతురామ్ (34) కుందుర్పి మండలం కదరంపల్లిలో ఆదివారం ప్రమాదవశాత్తూ బోరులారీ కింద పడి మృతి చెందాడు. కుందుర్పి పోలీసుల వివరాల మేరకు.. సంతురామ్ చత్తీస్‌ఘఢ్‌లోని దంతేవాడ జిల్లాకు చెందినవాడని పేర్కొన్నారు. జీవనోపాధి కోసం బోర్‌వెల్ పనుల నిమిత్తం ఓ లారీ యజమాని కింద పనులు చేస్తూ కుందుర్పి మండలానికి వచ్చాడన్నారు. కదరంపల్లిలో బోరుబావి తవ్వుతుండగా శ్రీశైలం అజాగ్రత్త కారణంగా లారీని మలుపుతిప్పే ప్రయత్నంలో భాగంగా మృతుడు సంతురామ్‌పై లారీ ఎక్కించుకుని వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఘటనపై కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎరువులు వేసి అస్వస్థతకు గురై ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
బొమ్మనహాళ్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కమ్మరి సురేష్ (34) ఆదివారం మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆదివారం సెలవు కావడంతో సురేష్ ఉదయం పొలంలో పత్తి పంటకు రసాయన ఎరువులు వేయడానికి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు తండ్రి తిప్పేస్వామితో కలిసి ఎరువు వేశారు. తండ్రి మధ్యాహ్న ఇంటికి రాగా, సురేష్ పొలంలోనే మిగతా ఎరువు వేసి వస్తాను అని చెప్పి పొలంలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం ఎండలో పనిచేసి ఓ చెట్టు కింద పడుకున్నాడు. చుట్టూ పక్కన పొలానికి చెందిన రైతులు సురేష్‌ను పలకరించిన ఎలాంటి స్పందన లేకపోడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనంలో బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సురేష్‌కు భార్య పవిత్రతో పాటు ముగ్గురు కుమారైలు ఉన్నారు. తిప్పేస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బొమ్మనహాళ్ పోలీసులు తెలిపారు.
జూదరుల అరెస్ట్
గుంతకల్లు రూరల్: గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్న 8 మంది జూదరులను ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ బాలముణి తెలిపారు. వారి వద్ద నుంచి రూ.2,21,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశామన్నారు.
అగ్నికి ఆహుతైన
మామిడి చెట్లు
పుట్టపర్తి: గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టడంతో బుక్కపట్నం సమీపంలోని రైతులకు చెందిన మామిడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం బుక్కపట్నం గ్రామానికి చెందిన అవుటాల రవీంద్రరెడ్డికి చెందిన వంద మామిడి చెట్లు కాలిపోగా, పక్కనే ఉన్న మరో రైతు చెన్నకృష్ణకు చెందిన 25 చెట్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. కాపుకు వచ్చిన చెట్లు కాలి పోవడంతో లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండలకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


