గుత్తి రూరల్: మండలంలోని అబ్బేదొడ్డిలో అక్రమంగా నిల్వ ఉంచిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. అబ్బేదొడ్డిలో అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచారని సమాచారంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆదివారం దాడులు చేశారు. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 10 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో తాడిపత్రి, పెద్దపప్పూరు సీఎస్‌డీటీలు మల్లేష్, రాజ, వీఆర్‌ఓ అబూబకర్ పాల్గొన్నారు.
అనంతపురం సెంట్రల్: గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసుకొని ఎక్కువ ధరలకు విక్రయించడం, చిన్న సిలిండర్లలలోకి నింపడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారి ప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం నగరంలో కోవూరునగర్‌లో చిత్ర విజయ్‌కుమార్ అనే వ్యక్తి ఇంట్లో 25 సిలిండర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే డీ.హీరేహాళ్ మండలం పులకుర్తిలో కాల్వ నారాయణరెడ్డి ఇంట్లో 14 సిలిండర్లను పట్టుకున్నామన్నారు. వారిపై ఈసీ యాక్టు 1955 మేరకు కేసులు నమోదు చేశామన్నారు.


