సందడిగా గుత్తి కోట ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

సందడిగా గుత్తి కోట ఉత్సవాలు

Mar 16 2026 7:35 AM | Updated on Mar 16 2026 7:35 AM

గుత్తి: చారిత్రక సంపద, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఆర్‌ఓ మలోల అన్నారు. రెండు రోజులుగా గుత్తిలో అత్యంత వైభవంగా గుత్తి కోట ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఆదివారం కోట సంబరాలు అంబరాన్నింటాయి. హెరిటేజ్‌ వాక్‌ అందరినీ ఆకట్టుకుంది. స్థానిక ఎంఎస్‌ ఫుట్‌ బాల్‌ క్రీడామైదానం వద్ద జెండా ఊపి డీఆర్‌ఓ హెరిటేజ్‌ వాక్‌ను ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం, గుత్తి కోట సంరక్షణ సమితి, పురావస్తు, పర్యాటక శాఖలు, రైల్వే డీజిల్‌షెడ్‌, వాకర్స్‌ అసోసియేషన్‌, ఐసీడీఎస్‌, మెప్మా, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. కోట ప్రాముఖ్యతను వివరిస్తూ కళాకారులు ప్రజలకు అభివాదం చేశారు. ముఖ్యంగా మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా, అంగన్‌వాడీ టీచర్లతో కలిసి వేసిన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. డీఆర్‌ఓ మలోల అల్లూరి సీతారామరాజు, గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకులు విజయ భాస్కర్‌ అలియా రాయల్‌, వెంకటరామిరెడ్డి వీర నరసింహం రాయల్‌, నాయుడు శ్రీకృష్ణ దేవరాయలు, హేమలత రాణి రుద్రమ దేవి వేష ధారణలతో ఆకట్టుకున్నారు. గురవయ్యల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఆర్‌డీఓ మలోల మాట్లాడుతూ గుత్తి కోటకు ఎంతో చరిత్ర ఉందన్నారు. కళలు, చరిత్ర, సంస్కృతి, చారిత్రక కట్టడాలను పరిరక్షించడం మనందరి బాధ్యతన్నారు. చారిత్రక ప్రదేశాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలన్నారు. గుత్తి కోట అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం జిల్లా పర్యాటకశాఖ అధికారి విజయకుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ పటంలో గుత్తి కోటకు స్థానం కలిగే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, పురావస్తుశాఖ అధికారి స్వామి నాయక్‌, తహసీల్దార్‌ పుణ్యవతి, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, మెప్మా విశ్వజ్యోతి, ఏఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement