దంపెట్లలో 800 ఏళ్ల నాటి శాసనం గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

దంపెట్లలో 800 ఏళ్ల నాటి శాసనం గుర్తింపు

Mar 16 2026 7:35 AM | Updated on Mar 16 2026 7:35 AM

బత్తలపల్లి: మండలంలోని దంపెట్ల గ్రామ సమీపంలోని చిత్రావతి నది ఒడ్డున వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో 800 ఏళ్లనాటి ప్రాచీన కన్నడ శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. ఆదివారం బత్తలపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బత్తలపల్లి మండలం దంపెట్ల గ్రామ శివారులో లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం ఉందన్నారు. ఈ ఆలయంలో 800 ఏళ్లనాటి ప్రాచీన కన్నడ శాసనాన్ని దేవగిరి యాదవరాజు సింహళదేవుడు క్రీశ 1225వ సంవత్సరం జనవరి 21న రాయించారని తెలిపారు. దాని ప్రకారం ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో అప్పట్లో మధురాపురం అనే గ్రామం ఉండేదని, ఆలయ సేవలకు చేసిన గుర్తింపుగా ఆ గ్రామ ప్రముఖులకు రాజు సర్వమాన్య భూములను దానంగా ఇచ్చినట్లు వివరించారు. భారత పురావస్తుశాఖ సహకారంతో గత అక్టోబర్‌లో ధర్మవరం మండలం కునుతూరు గ్రామంలోని ప్రాచీన చంద్రమౌళేశ్వర ఆలయంలో ఇదే రాజు వేయించిన శాసనాన్ని తాను కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రాచీన దేవాలయాల మీద తాను చేస్తున్న పరిశోధనలో భాగంగా ఈ శాసనాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. దంపెట్ల, కునుతూరు గ్రామాల్లో లభ్యమైన యాదవరాజుల శాసనాలను బట్టి ఉమ్మడి అనంతపురం జిల్లా చాలా కాలం పాటు ప్రస్తుత మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దేవగిరిని రాజధానిగా పాలించిన యాదవరాజుల ఏలుబడిలో ఉన్నట్లు గోపి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement