అన్ని చెరువులకు నీరివ్వాలి | - | Sakshi
Sakshi News home page

అన్ని చెరువులకు నీరివ్వాలి

Mar 16 2026 7:35 AM | Updated on Mar 16 2026 7:35 AM

అనంతపురం టవర్‌ క్లాక్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు హంద్రీనీవా ద్వారా నీరు ఇవ్వాలని ఓపీటీఆర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌కుమార్‌ ప్రభుత్వన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జలసాధన సమితి ఆధ్వర్యంలో హంద్రీనీవా ప్రాజెక్టు భవిష్యత్‌ ఏమిటి.. లక్ష్యం ఇంకెన్నేళ్లకు నెరవేరుతుంది అన్న అంశాలపై చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్‌ మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా ఉమ్మడి అనంత జిల్లాల్లో 3,45,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నారు. హంద్రీనీవా ద్వారా 120 వరద రోజుల్లో 100 టీఎంసీలు నీటిని ఎత్తిపోసుకునే వీలుగా ప్రస్తుత కాలువకు అదనంగా సమాంతర కాలువ వెడల్పు చేయాలన్నారు. హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులను అనుసంధానం చేయాలన్నారు. హెచ్‌ఎల్‌సీ నుంచి వచ్చే నీటిని నిలువ చేసేందుకు ఉంతకల్లు, పెరవలి వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఎల్‌సీ కాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి, మల్లికార్జున, శ్రీనివాసులు, ఉపేంద్ర కుమార్‌, ప్రకాష్‌, రాజశేఖర్‌రెడ్డి, అప్పిరెడ్డి, హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’

అనంతపురం సెంట్రల్‌: ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు, ఆ తర్వాత 23 నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా వ్యవసాయాధికారి రవి తెలిపారు. గ్రామస్థాయి అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తారన్నారు. అలాగే ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ వినియోగించడం ద్వారా రైతులకు కలిగే ఉపయోగాల గురించి తెలియజేస్తారని తెలిపారు. గ్రామస్థాయి అధికారుల బృందం రోజూ 90 ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించినట్లు వివరించారు.

బాలికకు తీవ్ర గాయాలు

గాండ్లపెంట: మండల పరిధిలోని రెక్కమాను గ్రామంలో ఓ బాలిక కాలిపై ఆర్టీసీ అద్దె బస్సు చక్రం ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. వివరాలు.. గ్రామానికి చెందిన హఫీఫా వైఎస్సార్‌ జిల్లా వేంపల్లిలోని మైనార్టీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వచ్చింది. డాక్టర్‌ దగ్గరకు వెళ్లేందుకు తన అవ్వతో కలసి ఆదివారం ఉదయం రాయచోటి ఆర్టీసీ డిపో అద్దె బస్సు ఎక్కింది. ఫుట్‌బోర్డు వద్ద నిలిచి ఉన్న బాలిక... బస్సు కదలడంతో అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో బస్సు వెనుక చక్రం బాలిక కాలిపై వెళ్లింది. దీంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే ఆమెను 108 వాహనం ద్వారా కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు.

నైపుణ్య శిక్షణ,

ఉపాధి అవకాశాలు

అనంతపురం: ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ కోర్సులో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమో, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారని, శిక్షణ అనంతరం వందశాతం ఉద్యోగ సహకారం అందిస్తామన్నారు. మార్చి 23 నుంచి నూతన బ్యాచ్‌ను ప్రారంభిస్తామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7780752418 ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement