వైభవంగా శ్రీవారి చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి చక్రస్నానం

Mar 13 2026 7:53 AM | Updated on Mar 13 2026 7:53 AM

నేటి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి శ్రీవారి దర్శనం

పుష్పయాగోత్సవంతో నేడు బ్రహ్మోత్సవాలకు ముగింపు

కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం(తీర్థవాది) గురువారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భృగుతీర్థం(కోనేరు)లో పుణ్యస్నానాలు ఆచరించారు. పక్షం రోజుల పాటు సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖ శాంతులతో ఉండేందుకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తామని అర్చక పండితులు వివరించారు. చక్రస్నానంలో భాగంగా శ్రీవారి సుదర్శన చక్రానికి భృగుతీర్థంలో స్నానం నిర్వహించే ముందు శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడికి స్నపన తిరుమంజనం గావించారు. తర్వాత పుష్కరిణిలో ముంచి స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శ కోసం భక్త జనులు పుష్కరిణి జలంతో స్నానమాచరించారు. తీర్థవాది ఉత్సవంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, పోలీసులతో పాటు పాల్గొన్న భక్తులందరూ రంగులు చల్లుకొని ఆనందోత్సాహాలతో గడిపారు.

చక్రస్నానంతో యజ్ఞఫలం

‘బ్రహ్మోత్సవాలు నిర్వహించిన వారికి.. ఇందుకు సహకరించిన వారికి ..ఉత్సవాల్లో శ్రీవారిని దర్శించుకున్న వారికి ఇలా..అందరికీ శ్రీవారి చక్రస్నానంతో ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది’ అని అర్చక పండితులు ఈ సందర్భంగా తెలిపారు. చక్రస్నానానికి ముందు స్వామివారికి పలు రకాల పూజలు నిర్వహించారు. ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం చేశారు.

ధ్వజావరోహణం

ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వా నిస్తూ గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసిన అర్చకులు..శ్రీవారి చక్రస్నానం అనంతరం దాన్ని ఽఅవరోహణం చేశారు. దీన్నే కదిరి ప్రాంతంలో కంకణాలు విప్పడం అంటారు. ధ్వజావరోహణంతో ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్లయిందని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు తెలిపారు.

ఆలయం మూత

బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణం నాటి నుంచి తీర్థవాది వరకూ స్వామి వారు యాగశాలలోనే గడిపారు. తీర్థవాది ముగించుకొని గురువారం స్వామివారు తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో సాయంత్రం నుంచి ఆలయం తలుపులు మూసివేశారు. శుక్రవారం ఆలయ శుద్ధితో పాటు సంప్రోక్షణ చేసిన తర్వాత స్వామివారిని మేల్కొల్పుతారు. అలంకరణ అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని అర్చక పండితులు తెలిపారు.

నేడు పుష్పయాగోత్సవం

బ్రహ్మోత్సవాల ముగింపునకు నిదర్శనంగా శుక్రవారం (నేడు) ఆలయ ప్రాంగణంలో పుష్పయాగోత్సవం నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలతో అలంకృతుడైన శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడు భక్తులను ఆశీర్వదిస్తారు. బ్రహ్మోత్సవాలకు నలుదిక్కుల నుంచి విచ్చేసిన ఇంద్రాది అష్ట దిక్పాలకులకు, ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలతో చందన, పుష్ప, తాంబూలాలు సమర్పించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement