పేదలకు అండ.. వైఎస్సార్‌సీపీ జెండా | - | Sakshi
Sakshi News home page

పేదలకు అండ.. వైఎస్సార్‌సీపీ జెండా

Mar 12 2026 7:31 AM | Updated on Mar 12 2026 7:31 AM

ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం

నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినం

జిల్లా అంతటా సంబరాలు

అనంతపురం: వైఎస్సార్‌ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్‌సీపీ 2011 మార్చి 12న ఆవిర్భవించింది. విలువలు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. తిరుగులేని శక్తిగా అవతరించింది. ప్రతిపక్షంలో ఉన్నా...అధికారంలో ఉన్నా జనహితమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది. ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తోంది.

‘నేనున్నానంటూ’ భరోసా..

వైఎస్‌ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమయ్యాక.. అప్పటి రాజకీయ పరిస్థితులు వైఎస్‌ జగన్‌ను ప్రజలకు దగ్గర చేశాయి. వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించాక... వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి 2017 నవంబర్‌ 6న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. 14 నెలల పాటు 3,648 కి.మీ దూరం మేర సాగిన ఈ పాదయాత్రలో పేదల కష్టాలను ఆయన కళ్లారా చూశారు. లక్షలాది మందికి ‘నేనున్నానంటూ’ అభయమిచ్చారు. వేలాది మందికి అప్పటికప్పుడే ఆపన్నహస్తం అందించారు. ఫలితంగా 2019లో జరిగిన ఎన్నికల్లో జనం చంద్రబాబు దుర్మార్గపు పాలనను కూకటి వేళ్లతో పెకలించారు. వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని అందించారు. 50 శాతానికి పైగా ఓట్లు, 151 శాసనసభ (87 శాతం), 22 లోక్‌సభ(88 శాతం) స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది.

ప్రజల ముంగిటకే పాలన

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక జనరంజక పాలన సాగించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ముందుకు సాగారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్‌ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లోకి నేరుగా ఆర్థికసాయం జమ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపి పెద్దకొడుకుగా నిలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయినా.. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడింది.

జిల్లా ప్రజలకు ఎంతో లబ్ధి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన (2019–2024)లో జిల్లా ప్రజలు కుల, మతాలు, పార్టీలకతీతంగా లబ్ధి పొందారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా 5 లక్షల మంది రైతులకు రూ.1767.09 కోట్లు, సున్నా వడ్డీ, పంట రుణాల ద్వారా రూ.900 కోట్లు, ఉచిత పంటల బీమా కింద రూ.918.57 కోట్లు అందింది. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా 3 లక్షల మందికి రూ.4,500 కోట్లు, వైఎస్సార్‌ చేయూత కింద రూ.10 వేల కోట్లు, వైఎస్సార్‌ బీమా కింద రూ.90 కోట్లు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 150 కోట్లు, జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ1200.49 కోట్ల మేర లబ్ధి అందింది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 43,301 మందికి రూ162.38 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.414..91 కోట్ల మేర ప్రయోజనం కలిగింది.

నేడు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించి గురువారం నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగిడుతోంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాపంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. అన్ని నియోజక వర్గాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకోవడంతో పాటు రక్తదానం, అన్నదానం, రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీకి సిద్ధమయ్యారు.

రెండేళ్లకే తారుమారు

రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ కొలువుదీరి రెండేళ్లవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా పన్నుల మోతతో జనానికి వాతలు పెట్టారు. నాటి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. చివరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు కూడా అందని పరిస్థితుల్లో యువత భవిత ప్రశ్నార్థకమైంది. బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలకు మంగళం పాడిన చంద్రబాబు కనీసం విత్తనాలు, ఎరువు కూడా ఇవ్వకపోవడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిత్యావసర ధరలను నియంత్రించకపోవడంతో సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు మళ్లీ అందరూ వైఎస్సార్‌సీపీవైపు చూస్తున్నారు. జగన్‌ పాలన కోసం జై కొడుతూ బాబు ప్రభుత్వంపై తిరుగు‘బావుటా’ ఎగురవేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement