గుత్తి: మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లికి వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జి వద్ద ఓ గుర్తు తెలియని మహిళ (38) మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం పడి ఉన్న స్థితి, అక్కడి ఆనవాళ్లను బట్టి అత్యాచారం చేసి హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆమె ఒంటరిగా చెట్నేపల్లి రోడ్డు వైపు వెళుతుండగా గమనించామని చెట్నేపల్లి వాసులు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. మృతదేహం పక్కన పురుషులకు సంబంధించిన చెప్పులు ఉన్నాయి. శరీరంపై చీర చిందర వందరగా పడి ఉంది. ఆ ప్రాంతంలో పోకిరీలు, గంజాయి బ్యాచ్ ఎక్కువగా సంచరిస్తూ ఉంటారని స్థానికులు తెలిపారు. ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్లిన మహిళ తెల్లవారేసరికి శవమై తేలడం వెనుక ఆంతర్యమేమిటో తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


